హైదరాబాద్ : ఆసరాగా ఉంటానని చెప్పి మహిళను లొంగదీసుకుని చిరవకు దారుణంగా హత్య చేసిన ఉదంతం కలకలం సృష్టిస్తోంది. ఈ దారుణ ఘటన గుజరాత్‌లోని బర్దోలీలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. భర్తకు దూరంగా ఉంటున్న ఐదు నెలల గర్భవతికి అండగా ఉంటానని లొంగదీసుకుని చివరకు అతి దారుణంగా హత్యచేశాడు. వివరాల ప్రకారం.. బర్దోలీకి చెందిన స్థానిక మహిళ రష్మీ కటారియా గత కొంతకాలంగా భర్తకు దూరంగా ఉంటోంది. ప్రస్తుతం ఆమె గర్భవతి, మూడేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. అయితే ఒంటరిగా ఉంటున్న రష్మీపై ఆమె ఇంటి సమీపంలోనే ఉండే చిరాగ్ పటేల్ కన్నేశాడు. భర్తకు దూరంగా ఉంటోందని తెలుసుకుని కష్ట సమయంలో అండగా ఉంటానని మాటిచ్చాడు. నమ్మిన రష్మీ అతనితో ప్రయాణం సాగించింది. ఈ క్రమంలోనే ఆదివారం రాత్రి మూడేళ్ల కుమారుడిని తన తల్లి ఇంటి వద్ద ఉంచి వెళ్లిపోయింది. అలా వెళ్లిన రష్మీ సోమవారం వరకూ తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ ఆచూకీ లభించకపోవడంతో.. చిరాగ్ అనే వ్యక్తిపై అనుమానం వ్యక్తం చేశారు. తన కుమార్తె అతనితో గతకొంత కాలంగా సహజీవనం చేస్తోందని, రష్మీ అతని వద్ద ఉండే అవకాశం ఉందని పోలీసుల దృష్టికి తీసుకువచ్చారు. వారి ఫిర్యాదు మేరకు స్పందిచిన అధికారులు.. చిరాగ్‌ను అదుపులోకి తీసుకుని విచారించడం ప్రారంభించగా.. సంచలన విషయాలను వెల్లడించారు. రష్మీని హత్య చేసి జేసీబీ సహాయంతో తన తండ్రి ఫాంహౌస్‌లో పూడ్చివేశానని చెప్పాడు. ఇద్దరి మధ్య విభేదాల కారణంగానే హత్య చేశానని ఒప్పుకున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. ఘటనాస్థలిలో మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు.. పోస్ట్‌మార్టం నిమిత్తం సమీపంలో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
Mon Jan 19, 2015 06:51 pm