హైదరాబాద్ : తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరుగుతున్నాయి. నిన్నటితో పోలిస్తే కేసుల సంఖ్య మళ్లీ పెరిగింది. తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ తాజా బులెటిన్ ప్రకారం 24 గంటల్లో కొత్తగా 993కరోనా కేసులు నమోదు అవగా మరో నలుగురు మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,66,042కి చేరింది. ఇందులో 2,53,715 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 10,886 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. తెలంగాణలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం మరణాల సంఖ్య 1441కి చేరింది. అయితే తెలంగాణలో కోవిడ్ సెకండ్ వేవ్ వచ్చే అవకాశముందని సీఎం కేసీఆర్ అన్నారు. దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో కోవిడ్ కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో అప్రమత్తంగా ఉండి, అవసరమైన అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో కేసులు మళ్లీ పెరగకుండా, సెకండ్ వేవ్ వచ్చినా తట్టుకునే విధంగా ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతుందని వెల్లడించారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, తగిన వ్యక్తిగత భద్రత పాటించడమే అసలైన మందు అని కేసీఆర్ సూచించారు. ప్రజలు తప్పనిసరిగా మాస్కులు, సామాజిక దూరం పాటించాలని కోరారు.
Mon Jan 19, 2015 06:51 pm