హైదరాబాద్: అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన వివాదస్పద వ్యాఖ్యలను మంత్రి కేటీఆర్ ఖండించారు. హుస్సేన్ సాగర్ కట్టపై ఉన్న పీవీ, ఎన్టీయార్ సమాధులను కూల్చేయాలంటూ జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా అక్బరుద్దీన్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అలాగే టీఆర్ఎస్ ప్రభుత్వంపై కూడా అక్బరుద్దీన్ తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. మాజీ ప్రధాని స్వర్గీయ శ్రీ పివి నరసింహారావు, ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ శ్రీ ఎన్టీఆర్ గార్లపై ఈ రోజు మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన అనుచితమైన వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈ ఇరువురు నాయకులు కూడా తెలుగు ప్రజల గౌరవాన్ని నిలబెట్టిన మహనీయులు. ఒకరు ప్రధానిగా, మరొకరు ముఖ్యమంత్రిగా సుదీర్ఘకాలం ప్రజాసేవలో ఉన్నారు. అటువంటి మహానాయకులపై అనుచిత వ్యాఖ్యలు గర్హనీయం. ప్రజాస్వామ్యంలో ఇటువంటి వ్యాఖ్యలకు చోటులేదు. అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm