హైదరాబాద్ : తన భర్త వేరే మహిళతో ఉండగా రెడ్ హ్యడెండ్ గా పట్టుకున్న మహిళ తన భర్తను నదిలో తోసి చంపాలనుకుంది. భర్త కాళ్లు, చేతులను కట్టేసి, అతన్ని నదిలోకి విసిరేసిందామె. చైనాలో జరిగిన ఈ ఘటన ఒక వీడియోలో రికార్డ్ అయింది. ఇప్పుడు ఆ వీడియో వైరల్‌గా మారింది. ఆ వ్యక్తి వేరే మహిళతో ఉండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య ఈ నిర్ణయం తీసుకుంది. నదిలోకి తోసేముందు అతడిని ఓ బోనులో పెట్టి కట్టివేసినట్లు చైనా మీడియా తెలిపింది. ఈ ఘటన చైనాలోని మామింగ్ నగరంలో శుక్రవారం ఉదయం జరిగింది. వేరే మహిళతో పట్టుబడ్డ భర్త అర్ధనగ్నంగా ఉన్నట్లు వీడియోలో కనిపిస్తోంది. కొంతమంది వ్యక్తులు అతడిని ఒక వెదురు బోనులో పెట్టి కట్టేశారు. బాధితుడు నొప్పితో ఏడుస్తున్నట్లు రికార్డ్ అయ్యింది. ఇలాంటి దారుణమైన శిక్షలు మనకు ఆశ్చర్యంగా అనిపించవచ్చు. కానీ చైనాలో ఇలాంటి వాటికి చరిత్రతో సంబంధం ఉంది. మాండరిన్ నుంచి అనువాదం చేస్తే ఆ శిక్షకు ‘పందులను ఉంచే బోనులో కట్టి నీటిలో ముంచివేయడం’ (dip in a pig cage) అనే అర్థం వస్తుంది. పురాతన చైనాలో మింగ్, క్వింగ్ రాజవంశాల పాలనలో వ్యభిచారానికి ఇలాంటి శిక్షను విధించేవారు. బోనులో పెట్టి నదిలో తోస్తే బాధితులు తప్పించుకోలేరు. ఈత కొట్టలేక నీటిలో మునిగి చనిపోతారు. అందుకే అలా చేసేవారు. బాధితుడు అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడ్డాడని డైలీ మెయిల్ వార్తాసంస్థ తెలిపింది. ఇది ఒక విచిత్రమైన సంఘటన అని పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి నలుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm