హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో ఈ నెల 20వ తేదీన తుంగభద్ర పుష్కరాలు ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ పుష్కరాలు డిసెంబర్ 1వరకు కొనసాగనున్నాయి. అయితే పుష్కర ఘాట్ల వద్ద కరోనా కలకలం సృష్టిస్తోంది. కరోనా నేపథ్యంలో పుష్కరాలకు వచ్చే పలువురు భక్తులకు, అక్కడ విధులు నిర్వర్తిస్తున్న సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే గురువారం 128 మంది సిబ్బంది, భక్తులకు ర్యాపిడ్ కిట్ల ద్వారా కరోనా పరీక్షలు నిర్వహించారు. అందులో ముగ్గురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కరోనా పాజిటివ్‌గా తేలివారిలో ఇద్దరు కానిస్టేబుళ్లు, ఒక భక్తుడు ఉన్నారు. చిత్తూరు జిల్లాకు చెందిన ఈ ఇద్దరు కానిస్టేబుల్స్ సంకల్‌బాగ్ ఘాట్, రాంరబొట్ల ఆలయంలో విధులు నిర్వర్తించేందుకు వచ్చారు. తాజా కేసులతో పుష్కర ఘాట్లలో ఇప్పటివరకు నమోదైన కరోనా పాజటివ్ కేసుల సంఖ్య 15కి చేరింది. అయితే వీరిలో 14 మంది పోలీసులే ఉన్నారు. పుష్కర ఘాట్ల వద్దకు వచ్చే ప్రతి భక్తునికి థర్మల్ స్క్రీనింగ్ నిర్వహిస్తున్నారు. ఆ తర్వాతే వారిని ఘాట్ల వద్దకు అనుమతిస్తున్నారు. ఒకవేళ భక్తులకు ఏవైనా లక్షణాలు కనబడితే వారి సాంపిల్స్ సేకరించి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇందుకోసం ప్రతి పుష్కర ఘాటు వద్ద వైద్య సిబ్బందిని ఉంచామని కర్నూలు జిల్లా వైద్యాధికారులు తెలిపారు. అలాగే భక్తులు కూడా మాస్క్‌లు ధరించాలని, ఘాట్ల వద్ద కోవిడ్ ప్రొటోకాల్స్ పాటించాలని కోరుతున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm