హైదరాబాద్ : వికారాబాద్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. కుటుంబంలో వచ్చిన చిన్నపాటి మనస్పర్ధల కారణంగా ఓ మహిళ తన ముగ్గురు పిల్లలతో కలిసి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. ఈ ఘటన కొడంగల్ మండలం అస్నాబాద్‌లో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా ఇద్దరు గల్లంతయ్యారు. మద్దూరు మండలం కొమ్మూరుకు చెందిన ఎల్లమ్మ(32) ఇంట్లో చిన్న గొడవ చోటుచేసుకోవటంతో మనస్తాపం చెందింది. ఆమె తన ముగ్గురు పిల్లలతో కలిసి దేవాలయానికి వెళ్దామని చెప్పి కొడంగల్ మండలం అస్నాబాద్‌కు వెళ్లింది. ఆ గ్రామంలోని పెద్దచెరువు వద్దకు పిల్లల్ని కాలినడకన తీసుకువెళ్లిన ఎల్లమ్మ.. పెద్దకూతురు రజిత(9), కుమారుడు రాజు(5)ను అకస్మాత్తుగా చెరువులో తోసేసింది. మరో పాప అనిత(7)తో పాటు దూకేందుకు ప్రయత్నించగా పాప తప్పించుకుంది. దీంతో ఎల్లమ్మ చెరువులో పడిపోయింది. అనిత ద్వారా విషయం తెలుసుకున్న స్థానికులు చెరువులో వెతకగా రాజు మృతదేహం లభ్యమైంది. మిగిలిన రెండు మృతదేహాల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నట్టు పోలీసులు తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm