హైదరాబాద్ : ఏపీ ప్రభుత్వం జీవితఖైదు పడిన 53 మంది మహిళల విడుదలకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా 53 మంది మహిళా ఖైదీలకు జీవితఖైదు నుంచి ప్రత్యేక మినహాయింపు ఇస్తూ హోంశాఖ ఈ ఉత్తర్వులు జారీ చేసింది. దీనిలో భాగంగానే వివిధ జైళ్లలో ఉన్న ఖైదీల ముందస్తు విడుదలకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ మేరకు హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ నేతృత్వంలోని స్టాండింగ్ కమిటీ వీరి విడుదలకు సిఫార్సు చేసింది. మహిళా ఖైదీల ముందస్తు విడుదలకు ప్రభుత్వం కొన్ని షరతులు విధించింది. విడుదలయ్యే ఖైదీలు.. 50 వేల రూపాయల వ్యక్తిగత బాండ్ సమర్పించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మరోసారి నేరానికి పాల్పడితే తక్షణమే అరెస్ట్ చేసి ముందస్తు విడుదల రద్దు చేస్తామని ప్రభుత్వం హెచ్చరించింది. ప్రతి మూడు నెలలకోసారి స్థానిక పోలీసు స్టేషన్లో అధికారి ముందు హాజరు కావాలని తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm