హైదరాబాద్ : టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో ఆర్యవైశ్యులకు సముచిత గౌరవం కల్పించినట్లు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర పురపాలక శాఖా మంత్రి కేటీఆర్ అన్నారు. పీపుల్స్ ప్లాజాలో జరిగిన ఆర్య వైశ్య ఆత్మీయ అభినందన సభలో పాల్గొన్న కేటీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో కుల, మతాలకు అతీతంగా సంక్షేమ, అభివృద్ధి పథకాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ రాష్ట్రంలో సంక్షేమాని, అభివృద్ధిని జోడెడ్లులాగా ముందుకు తీసుకెళ్తున్నారన్నారు. రాష్ర్టాన్ని ఎవరు ప్రగతిపథంలో ముందుకు తీసుకెళ్తున్నారో ఆలోచించాలని కోరారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్యులు కూడా ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లి ఆయన నుంచి సానుకూల నిర్ణయం వచ్చేలా కృషి చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్ర రాబడి పెరిగినప్పుడే పేదల సంక్షేమం సాధ్యం అవుతుందన్నారు. పేదల సంక్షేమం కోసం అనేక పథకాలు తీసుకొచ్చామన్నారు. రాష్ట్ర ఆదాయం పెరగాలన్న, అభివృద్ధి చెందాలన్న శాంతిభద్రతలు ముఖ్యమన్నారు. రాష్ర్టానికి పెట్టుబడులు రావాలంటే శాంతిభద్రతలు అదుపులో ఉండాలన్నారు. గత ఆరేండ్ల టీఆర్‌ఎస్ పాలనలో రాష్ట్రంలో శాంతిభద్రతలు ఎలా పరిఢవిల్లాయో యోచించాలని కోరారు.
Mon Jan 19, 2015 06:51 pm