హైదరాబాద్ : జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మాస్కు ఉంటేనే ఓటర్లకు ప్రవేశమని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి వెల్లడించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల సిబ్బంది కోసం 1.20 లక్షల పీపీఈ కిట్లు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. కరోనా దృష్ట్యా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామంటున్న పార్థసారథి తెలిపారు. ఎన్నికలు స్వేచ్ఛగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకున్నాం. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద సూక్ష్మ పరిశీలకులతో సహా పూర్తిస్థాయిలో పోలీసు సిబ్బంది ఉంటారు. ఎలాంటి పొరపాట్లకు అవకాశమివ్వం. విద్వేషకర ప్రసంగాలు చేసేవారిపై చర్యలు తీసుకుంటాం అని ఎన్నికల కమిషనర్ తెలిపారు.
కరోనా దృష్ట్యా సిబ్బందికి శిక్షణ మొదలుకొని... పోలింగ్, కౌంటింగ్ వరకు అన్ని రకాల జాగ్రత్త చర్యలు చేపట్టాం. మాస్కు ధరించడం, దూరం పాటించడం, శానిటైజ్ చేసుకోవడం కచ్చితంగా అమలు చేస్తున్నాం. ప్రతి పోలింగు కేంద్రాన్ని ఒక రోజు ముందే శానిటైజ్ చేస్తాం. నోడల్ వైద్యబృందాలు ఉంటాయి. పోలింగ్ సిబ్బంది కోసం 1.20 లక్షల పీపీఈ కిట్లతో పాటు 60 వేల శానిటైజర్ సీసాలు అందుబాటులో ఉంటాయి. ఓటర్లు నిర్ణీత దూరంలో నిలబడేందుకు వలయాకార గుర్తులు ఏర్పాటు చేశాం. ప్రతి ఓటరు మాస్కు లేనిదే ప్రవేశించకుండా తనిఖీ చేయడం, ప్రవేశద్వారం వద్దనే శానిటైజర్ ఏర్పాటు లాంటి చర్యలు చేపట్టాం.
ఎన్నికల్లో 52,500 మంది పోలీసు సిబ్బందిని వినియోగిస్తున్నాం. నిరంతరం పర్యటించేలా 60 ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఏర్పాటు చేశాం. మరో 30 స్క్వాడ్‌లు అవసరమైన చోటుకు వెళ్లడానికి అందుబాటులో ఉంటాయి. 30 పోలీసు చెక్‌పోస్టులు ఏర్పాటు చేశాం. వీటిలో ఎక్సైజ్ సిబ్బంది కూడా ఉంటారు. ప్రతిరోజు మద్యం విక్రయాలను పర్యవేక్షిస్తున్నాం. అనుమతి లేని మద్యం దుకాణాలను తొలగించాం. ఇప్పటివరకు మద్యం, నగదు స్వాధీనం సహా 54 కేసులు నమోదు చేశామని అన్నారు.
విద్వేషాలు రెచ్చగొట్టేలా... ఇతరులను కించపరిచేలా మాట్లాడే వారిపై ఎన్నికల నియమావళి ప్రకారం చర్యలు తీసుకుంటాం. ప్రత్యేక పరిశీలకులు కూడా వీటిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తుంటారని పేర్కొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 28 Nov,2020 07:38AM