అమరావతి: గుంటూరు జిల్లాలో దారుణం జరిగింది. ప్రియుడితో కొనసాగుతున్న సంబంధానికి భర్త అడ్డుగా ఉండడంతో అతడిని హత్య చేయాలని ప్రియుడితో కలిసి భార్య కుట్ర పన్నింది. భర్తను హత్య చేయించేందుకు రూ.10లక్షలు ఖర్చు చేసింది. ఈ నెల 4న జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. పోలీసుల వివరాల ప్రకారం.... గుంటూరు జిల్లాలోని పెదకూరపాడు మండలంలోని 75 తాళ్లూరుకు చెందిన భాష్యం బ్రహ్మయ్య గ్రామంలో హోటల్ తో పాటు పాల వ్యాపారం కూడా చేసేవాడు. గ్రామ శివారులో బ్రహ్మయ్యను అడ్డగించిన ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ముఖంపై సైనేడ్ చల్లి దాడికి యత్నించారు. ఈ దాడి నుంచి తప్పించుకున్న బ్రహ్మయ్య దగ్గరిలోని బంధువుల ఇంటికి వెళ్లి జరిగిన విషయం చెప్పాడు. వారు అతని ఆస్పత్రికి మార్గమధ్యంలో మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు హత్య జరిగిన రోజు రాత్రి బ్రహ్మయ్య భార్య సాయికుమారి అదే గ్రామానికి చెందిన అశోక్‌రెడ్డికి కాల్ చేసినట్టు గుర్తించారు. అదే సమయంలో కృష్ణా జిల్లా మచిలీపట్టణానికి కూడా కాల్స్ వెళ్లినట్టు గుర్తించారు. కాల్‌డేటా ఆధారంగా సాయికుమారిని విచారించగా అశోక్‌రెడ్డితో ఉన్న వివాహేతర సంబంధం బయటపడింది. మరింత లోతుగా విచారించగా బ్రహ్మయ్య హత్యకు పన్నిన కుట్ర బయటపడింది. తమ మధ్య కొనసాగుతున్న సంబంధానికి భర్త అడ్డుగా ఉండడంతో అతడిని హత్య చేయాలని ప్రియుడు అశోక్‌రెడ్డితో కలిసి సాయికుమారి కుట్ర పన్నింది. ఇందులో భాగంగా మచిలీపట్టణానికి చెందిన పవన్ కుమార్, షేక్ షరీఫ్‌లతో రూ. 10 లక్షలతో ఒప్పందం కుదుర్చుకున్నారు. కొంత మొత్తం అడ్వాన్స్‌గా చెల్లించారు. ఈ క్రమంలో హత్య కోసం సైనేడ్‌ను ఉపయోగించారు. అది పనిచేస్తుందో, లేదో తెలుసుకునేందుకు ఓ కుక్కకు తినిపించగా, అది వెంటనే మరణించింది. దీంతో బ్రహ్మయ్య హత్యకు సిద్దమై అతడిని చంపేందుకు మొదట రెక్కీ నిర్వహించారు. ఆ తర్వాత గ్రామ శివారులో ఒంటరిగా కనిపించిన అతనిపై సైనేడ్ చల్లి పరారయ్యారు. దాని ప్రభావంతోనే అతడు మరణించినట్టు తేలింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సుపారీ తీసుకున్న ఇద్దరు యువకులతోపాటు సాయికుమారి, అతడి ప్రియుడు అశోక్‌రెడ్డిలను అరెస్ట్ చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm