సంగారెడ్డి: మంజీర నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్న ఏఓ అరుణ మృతదేహం లభ్యమైంది. జిల్లాలోని మనూరు మండలం రావిపల్లి బ్రిడ్జిపై నుంచి నాలుగురోజులు క్రితం మంజీరా నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్న వ్యవసాయశాఖ అధికారిణి అరుణ మృతదేహన్ని నేటి ఉదయం పోలీసులు గుర్తించారు. గత నాలుగు రోజులుగా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో కలిసి గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు ఆమె మృతదేహాన్ని మంజీరా నదిలో గుర్తించారు. గురువారం సంగారెడ్డిలోని రైతు శిక్షణ కేంద్రం నుండి మధ్యాహ్నం 12 గంటలకు బయలుదేరి అక్కడి నుంచి మనూరు మండలం రాయిపల్లి శివారులోని మంజీర నది వద్దకు వచ్చారు. అక్కడ నుండే తన తమ్ముడు శివకుమార్‌కు ఫోన్ చేసి మంజీర వంతెనపై నుంచి నదిలో దూకి నేను చనిపోతున్నాని చెప్పి ఫోన్ కట్ చేశారు. తిరిగి శివకుమార్ తన సోదరికి ఫోన్ చేసినా కలవకపోవడంతో వంతెన వద్దకు వచ్చి గాలించారు. వంతెనపైనే అరుణ కారు, పర్సు, ఫోన్, చెప్పులు ఉండటంతో మనూరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మంజీర ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో పోలీసులకు గాలించడం కష్టంగా మారింది. దీంతో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది నాలుగు రోజులు శ్రమించి నేటి ఉదయం అరుణ మృతదేహాన్ని ఇవాళ గుర్తించారు.
Mon Jan 19, 2015 06:51 pm