హైదరాబాద్: పెళ్లి ఇంట్లో మాంసం సరిగా పెట్టలేదనే గొడవ ఓ వ్యక్తి ప్రాణాలు బలిగొంది. ఈ దారుణ ఘటన యాదాద్రి భువనగరి జిల్లా మోత్కూరు మండలం దాచారం గ్రామంలో చోటుచేసుకుంది. దాచారం గ్రామానికి చెందిన మహేష్‌కు జనగామ జిల్లా కొడకండ్ల మండలం పాకాల గ్రామానికి చెందిన యువతితో నిశ్చయమైంది. పెళ్లికొడుకు బందువులు పెళ్లికూతురుని తీసుకువచ్చేందుకు జనగామ జిల్లా కొడకండ్ల మండలం పాకాల గ్రామానికి వెళ్లారు. అక్కడ పెళ్లికూతురు సంబంధికులు మర్యాద సరిగా చేయలేదని, మాంసం సరిగా పెట్టలేదని దాచారానికి చెందిన సూరారం వెంకటయ్య అదే గ్రామానికి చెందిన కుల పెద్ద చంద్రయ్యతో గొడవ పడ్డాడు. ఆ గొడవ బంధువుల చొరవతో సద్దుమణిగింది. మంగళ వారం రాత్రి దాచారం గ్రామం వచ్చిన తర్వాత మరల అదే విషయంలో సదరు సూరారం వెంకటయ్య గొడవ పడుతుండగా అదే సమయంలో వెంకటయ్య కుమారుడు సూరారం ప్రవీణ్ చేతిలో గొడ్డలి పట్టుకొని వచ్చి నేరుగా కుల పెద్ద చంద్రయ్య ఇంటిలోకి ప్రవేశించి తన చేతిలో ఉన్న గొడ్డలితో చంద్రయ్య కుమారులు అయిన నాగరాజు, పరశురాములులపై దాడి చేశాడు. ఈ దాడిలో సూరారం పరుశరాములుకు మెడపై, చెవి వద్ద గాయాలయ్యాయి. సూరారం నాగరాజుకు ఎడమ చేతిపై గాయం అయింది. ఇద్దరిని భువనగిరి జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో పరశురాములు మృతి చెందాడు. నాగరాజుని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్లోని ప్రవేటు ఆస్పత్రికి తరలించారు. బుధవారం దాచారం గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. అయినప్పటికీ పెండ్లి తంతు సజావుగా జరిగింది.
Mon Jan 19, 2015 06:51 pm