హైదరాబాద్: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఓటింగ్ శాతం భారీగా తగ్గంది. దినిపై సైబరాబాద్ సీపీ సజ్జనార్ తీవ్రంగా స్పందించారు. పోలింగ్ శాతం తగ్గడంపై రాష్ట్ర ఎన్నికల కమిషన్, అధికారులతోపాటు సమాజం కూడా ఆలోచించాల్సిన పరిస్థితి దాపరించిందని ఆయన అభిప్రాయపడ్డారు. మంగళవారం జరిగిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో 45.97శాతం పోలింగ్ నమోదైంది. ప్రతిపౌరుడు తమ ఓటు హక్కును తప్పని సరిగా వినియోగించుకొవాలని సీపీ సూచించారు. ఏ ఎన్నికలైనా కోట్లాది రూపాయలు ప్రజధనంతో నిర్వహిస్తారు. దీనిని సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపైన ఉందని సజ్జనార్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ 'ఓటు వేసిన వారిని ఒక విధంగా, వేయని వారిని మరో విధంగా చూడాల్సిన పరిస్థితి వచ్చిందనిపిస్తోంది. ఓటు వేసిన వారికి పారితోషికం రూపంలో పలు ప్రయోజనాలు కల్పించి అన్ని సదుపాయాలు అందేలా ఆలోచించాలి. ఓటు వేయని వారికి ఎలాంటి ప్రయోజనాలూ అందకుండా చూడాలి. విద్యార్థులు సర్టిఫికెట్లు, అడ్మిషన్లు, ఉద్యోగ అవకాశాల విషయంలో కూడా వ్యత్యాసం చూపాల్సిన పరిస్థితి వచ్చిందనిపిస్తోంది. ఈ విషయంపై అధికార యంత్రాంగంతోపాటు ఎన్నికల కమిషన్ కూడా ఆలోచించాలి. రాజకీయ పార్టీలు, సీనియర్ ఐపీఎస్ అధికారులతో కమిటీ వేసి ఓ నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది' అని అభిప్రాయపడ్డారు.
Mon Jan 19, 2015 06:51 pm