విజయవాడ: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ వ్యతిరేక చట్టాలపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరేమిటో స్పష్టం చేయాలని శాసనమండలి పిడిఎఫ్ ఫ్లోర్ లీడర్ విఠపు బాలసుబ్రహ్మణ్యం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నివార్ తుఫాన్, భారీ వర్షాల వల్ల పంట నష్టంపై మండలిలో స్వల్ప కాలిక చర్చలో భాగంగా వ్యవసాయ శాఖమంత్రి కురసాల కన్నబాబు మంగళవారం సమాధానం చెప్పారు. ఈ సందర్భంగా విబిఎస్ మాట్లాడుతూ రైతు వ్యతిరేక చట్టాలపై దేశం మొత్తం భగ్గుమంటోందని, వీటిపై రాష్ట్రం ఎలాంటి వైఖరి తీసుకుంటుందో చెప్పాలని డిమాండ్ చేశారు. మార్కెట్లను ఆధునీకరిస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పిందని, ఈ నిర్ణయాన్ని తాము అభినందిస్తున్నామన్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం మార్కేట్లే అవసరం లేదని, నేరుగా కార్పొరేట్లకే పంట అమ్ముకోవచ్చునని చెబుతోందని, ఈ నేపథ్యంలో ఈ చట్టాలపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరి స్పష్టం చేయాలన్నారు. మంత్రి కన్నబాబు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పకుండా సమాధానం దాటవేశారు. పిడిఎఫ్ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ నష్టపరిహారానికి ఆధారంగా పేర్కొంటున్న ఇ-క్రాప్ చాలామంది చేయించుకోలేకపోతున్నారని తెలిపారు. నేరుగా అధికారులతో నష్టపరిహారం అంచనా వేయించాలని కోరారు. ఎన్‌డిఆర్‌ఎఫ్, ఎస్‌డిఆర్‌ఎఫ్ నిబంధనాల్లో ఒక సీజన్‌లో ఒకసారి మాత్రమే నష్టపరిహారం ఇవ్వాలని ఉన్నట్లు తెలిసిందన్నారు. రెండోసారి కూడా పరిహారం ఇచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరాలని తెలిపారు. దీనిపైనా మంత్రి సమాధానం చెప్పకుండా దాటేశారు. గుంటూరు జిల్లాల్లో 1.50 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారని, కౌలు కార్డులు 30 వేల మందికి మాత్రమే ఇచ్చారని లక్ష్మణరావు తెలిపారు.వీరిలో 5వేల మంది రైతు భరోసా, 15వేల మందికి రుణాలు ఇచ్చారని తెలిపారు. మిగిలిన వారికి ఎలాంటి సహాయం అందలేదన్నారు. కార్డులు లేని కౌలు రైతులకు కూడా ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వాలని కోరారు. సిసిఆర్‌డి కార్డు కలిగిన కౌలు రైతులకు అందరికీ ఇస్తున్నామని మంత్రి చెప్పారు.
Mon Jan 19, 2015 06:51 pm