హైదరాబాద్ : కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా చేస్తున్న రైతుల నిరసనలు ఇంకా కొనసాగుతున్నాయి. తమ ఆందోళనను ఇంకా తీవ్రతరం చేయాలని రైతులు నిర్ణయించుకున్నారు. ఈ సందర్భంగా రైతులు ఈనెల 5వ తేదీన దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చారు. ఈరోజు ఉదయం సింఘు వద్ద జరిగిన సమావేశం అనంతరం రైతుసంఘాల ప్రతినిధులు ఈ నిర్ణయం ప్రకటించారు. సంయుక్త కిసాన్ మోర్చా కింద పోరాటాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. భేషరతుగా మూడు చట్టాలను వెనక్కి తీసుకోవాలని కేంద్రానికి రాతపూర్వకంగా లేఖ రాశారు. చట్టాల్లోని అభ్యంతరాలను కేంద్రానికి సమర్పించారు. అలాగే విద్యుత్ చట్ట సవరణ బిల్లును సైతం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నెల 5న గ్రామాల్లో నిరసనలకు పిలుపునిచ్చిన రైతు సంఘాలు.. మోదీ ప్రభుత్వం, కార్పొరేట్ సంస్థలకు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టాలని పిలుపునిచ్చారు. ఢిల్లీలోని అన్ని రోడ్లను దిగ్బంధిస్తామని హెచ్చరించారు.
Mon Jan 19, 2015 06:51 pm