హైదరాబాద్ : గ్రేటర్ ఎన్నికల వేళ రసవత్తర సన్నివేశాలు చోటు చేసుకుంటున్నాయి. ఓ వైపు గ్రేటర్ ఎన్నికల పోలింగ్ ఉత్కంఠ రేపుతోన్న సమయంలో.. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ సర్క్యులర్‌ను రద్దు చేసింది హైకోర్టు. స్వస్తిక్ ముద్రతో పాటు ఏ గుర్తు ఉన్న ఓటుగా పరిగణించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.. అయితే... ఎన్నికల సంఘం ఉత్తర్వులను సవాలు చేస్తూ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది బీజేపీ. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు... తెలంగాణ రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ సర్క్యులర్ ను సస్పెండ్ చేసింది. దీంతో.. ఎన్నికల కమిషన్‌కు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలినట్టు అయ్యింది. అయితే, ఎలక్షన్ కమిషన్ సర్క్యూలర్ ను సస్పెండ్ చేసిన హైకోర్టు... గెలుపోటముల దగ్గర మార్కింగ్ ఉంటే తుది ఉత్తర్వులకు లోబడి ఫలితాలు వెల్లడించాలని ఆదేశించింది. స్వస్తిక్ గుర్తు ఉన్న బ్యాలెట్ ను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలన్న హైకోర్టు... వెంటనే అన్ని కౌంటింగ్ కేంద్రాలకు సమాచారం అందించాలని ఎన్నికల కమిషన్ కు ఆదేశాలు జారీ చేసింది.. పూర్తి వివరాలతో కౌంటర్ ధాఖలు చేయాలన్న హైకోర్టు.. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.
Mon Jan 19, 2015 06:51 pm