హైదరాబాద్: వ్యవసాయ చట్టాలపై వ్యతిరేకత కనబరుస్తున్న రైతు సంఘాలతో కేంద్రం చేపట్టిన చర్చలు మరోసారి విఫలమయ్యాయి. ఈరోజు ఐదో దఫా చర్చలు జరిపినా ఇరువర్గాల మధ్య సామరస్యం కుదరలేదు. చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాల్సిందేనని రైతు సంఘాలు డిమాండ్ చేయగా, పంటలకు మద్దతుధరపై లిఖితపూర్వక హామీ ఇస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. అయితే, రైతు సంఘాల ప్రతినిధులు కేంద్రం ప్రతిపాదనకు అంగీకరించలేదు. తమ డిమాండ్లపై పట్టువీడేందుకు మొగ్గుచూపలేదు. సుమారు 45 పంటలకు ఎంఎస్పీ ఉందని, ఎంఎస్పీ ఉన్న 94 శాతం పంటలకు మద్దతుధర రావడంలేదని రైతు సంఘాలు స్పష్టం చేశాయి. పంటలను మద్దతుధర కంటే తక్కువకు కొనేవారిని అరెస్ట్ చేయాలని రైతులు డిమాండ్ చేశారు. కాగా, డిసెంబరు 8న తలపెట్టిన భారత్ బంద్ ను వాయిదా వేయాలని రైతు సంఘాలను కేంద్రం కోరింది. పిల్లలు, వృద్ధులు నిరసనల నుంచి వెళ్లిపోవాలని విజ్ఞప్తి చేసింది. కొత్త చట్టాలను పూర్తిగా రద్దు చేసే పరిస్థితి లేదని, అయితే కొన్ని సవరణలు చేసే అంశాన్ని పరిశీలిస్తామని కేంద్రం తెలిపింది. దాంతో, చట్టాల రద్దు, డిమాండ్లకు ఒప్పుకున్నాకే ఆందోళన విరమిస్తామని రైతులు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో డిసెంబరు 9న మరోసారి సమావేశమవ్వాలని కేంద్రం, రైతు ప్రతినిధులు నిర్ణయించారు.
Mon Jan 19, 2015 06:51 pm