హైదరాబాద్ : ఒడశాలో ఓ వ్యక్తిని చెట్టుకు కట్టేసి నిప్పు పెట్టారు. అత్యంత దారుణంగా మంటల్లో కాలి చనిపోయాడు. ఒడిశాలోని హండపా పోలీస్ స్టేషన్ పరిధిలో కడలిముండా అనే గ్రామం లో ఈ సంఘటన జరిగింది. గ్రామానికి చెందిన ఓ 25 సంవత్సరాల యువకుడు నిత్యం మద్యం తాగి గోల చేస్తున్నాడు. బంధువులు, ఇరుగుపొరుగు వారు, గ్రామస్తులతో అసభ్యంగా ప్రవర్తిస్తూ రోజూ ఇంటి మీదకు గొడవలు తెస్తున్నాడు. అతడికి మద్యం మానేయాలని కుటుంబసభ్యులు నచ్చజెప్పారు. బందువులు కూడా హెచ్చరించారు. అయినా సరే ఆ యువకుడు వారి మాట వినలేదు. రోజూ మద్యం తాగి వచ్చి ఇతరులతో గొడవపడడం చేసేవాడు. ఈ క్రమంలో అతడి తీరుతో కుటుంసభ్యులు, గ్రామస్తులు విసిగిపోయారు. ఆడవారితో అసభ్యంగా ప్రవర్తిస్తుండడంతో కోపోద్రిక్తులయ్యారు. ఈ క్రమంలో జనవరి 12వ తేదీ సాయంత్రం కూడా యువకుడు మళ్లీ మద్యం తాగి వచ్చి గొడవ చేయడం మొదలు పెట్టాడు. దీంతో బంధువులు అతడిని చెట్టుకు కట్టేశారు. బీభత్సంగా కొట్టారు. ఆ కోపంలో ఏకంగా అతడి మీద పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఆ మంటల్లో అతడు సజీవదహనం అయ్యాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో సంబంధం ఉన్న వారిని అరెస్టు చేస్తామని చెప్పారు.
Mon Jan 19, 2015 06:51 pm