హైదరాబాద్: ఒక ప్రమాదం విషయంలో యువకుల మధ్య మొదలైన ఘర్షణ ఓ వ్యక్తి మరణానికి కారణమైంది. రెండు రోజుల కిత్రం నగరంలో జరిగిన చిన్న ప్రమాదంలో బైక్ పాడయ్యింది. అయితే ఈ ప్రమాదంలో వ్యక్తులకు పెద్దగాయాలు కాలేదు. వివరాలలోకి వెళ్లితే.. నాసర్ అనే వ్యక్తి వాహనాన్ని ఫైజల్ ఢీ కొట్టడంతో అతని వాహనం పాడయ్యింది. ఈ క్రమంలో నాసర్ తన స్నేహితులను వెంటబెట్టుకుని వాహన ప్రమాదం విషయంలో మాట్లాడేందుకు ఫైజల్ను పిలిపించారు. వారి మధ్య మాటా మాటా పెరగడంతో నాసర్, అతని వెంట వచ్చిన యువకులు ఫైజల్పై దాడి చేశారు. ఒక్కసారిగా అందరూ కలిసి దాడి చేయడంతో ఫైజల్ స్పృహ కోల్పోయి అక్కడికక్కడే మరణించాడు. సమాచారం అందుకున్న చిలకలగూడ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని.. ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఫైజల్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.
Mon Jan 19, 2015 06:51 pm