కడప: దేశవ్యాప్తంగా ఏ ఆలయంలోనైనా ఆడవారు పొంగళ్లు వండుతుంటారు. ఈ ఆలయంలో మాత్రం పురుషులే పొంగళ్లు వండుతుంటారు. ఈ వింత ఆచారం సంక్రాంతి పండుగ సందర్భంగా కడప జిల్లా పుల్లంపేట మండలం తిప్పాయపల్లె సంజీవరాయ ఆలయం ఉంది. సంక్రాంతి పండుగకు వచ్చే ముందు ఆదివారం ఆ గ్రామంలో పురుషులు మాత్రమే ఆలయంలో పొంగళ్లు పెట్టి, మహిళలకు పెట్టకుండా.. వారు చేసిన ప్రసాదాన్ని వారే తినేస్తారట. ఈ ఆలయంలోకి మహిళలు రావడం పూర్తిగా నిషేధం. అయితే ఆలయ ప్రాంగణానికి వెలుపల నుంచే సంజీవరాయునికి మొక్కుకొని మహిళలు తిరుగు పయనమవుతుంటారు. అసలు సంజీవరాయునికి ప్రత్యేకించి ఆలయమంటూ లేదు. ఒక రాతిశిలపై ఉన్న లిపినే ఇక్కడ సంజీవరాయునిగా ప్రజలు కొలుస్తున్నారు. ఆ గ్రామానికి చెందిన ఉద్యోగస్తులు ఇతర రాష్ట్రాల్లో, ఇతర ప్రాంతాల్లో ఉన్నవారంతా అక్కడికి చేరుకుని తమ పూర్వీకుల నుంచి వస్తోన్న సంప్రదాయానికి అనుగుణంగా పొంగళ్లు పెట్టుకుంటున్నారు. ఆ ఊరి ప్రజలు సంక్రాంతి పండుగకన్నా.. ఈ సంజీవరాయుని పొంగళ్లు పెట్టుకోవడమే పెద్ద పండుగగా జరుపుకుంటారు. ఇక ఆ మండలం నుంచే కాకుండా.. చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా పురుషులు స్వామి వారిని దర్శించుకుని కొబ్బరి, బెల్లాన్ని కానుకలుగా సమర్పిస్తుంటారు.
Mon Jan 19, 2015 06:51 pm