హైదరాబాద్ : పౌల్ట్రీ ఉత్పత్తులపై నిషేధం విధించకుండా, తగిన జాగ్రత్తలతో క్రయవిక్రయాలకు అనుమతించాల్సిందిగా రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం మరోమారు కోరింది. బాగా వండిన కోడిమాంసం, గుడ్లతో ఎటువంటి ఇబ్బంది లేదని.. జనం అనవసరమైన అపోహలకుపోతే కొవిడ్-19తో ఇప్పటికే దెబ్బతిన్న పౌల్ట్రీ, మొక్కజొన్న రైతులు మరింత నష్టపోతారని హెచ్చరించింది. రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల్లో ఈ మేరకు అవగాహన పెరిగేలా తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది. మహారాష్ట్రలోని తొమ్మిది జిల్లాల్లో పౌల్ట్రీ కోళ్లకు బర్డ్‌ఫ్లూ సోకినట్లు గుర్తించినట్లు కేంద్రం శనివారం ప్రకటించింది. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లోని ఒక్కో జిల్లాలో కోళ్లను పూడ్చిపెట్టే ప్రక్రియ కొనసాగుతోందని తెలిపింది. ఉత్తరాఖండ్, గుజరాత్, ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రాల్లో కాకుల్లోనూ.. పావురాలు, ఓ రకమైన గుడ్లగూబలు, కొంగల్లో బర్డ్‌ఫ్లూ లక్షణాలు బయటపడినట్లుగా వివరించింది. దేశంలో ఈ వ్యాధి ప్రధానంగా సెప్టెంబరు నుంచి మార్చి నడుమ వచ్చే వలస పక్షులతో వస్తున్నట్లు వెల్లడించింది. ఢిల్లీ జంతు ప్రదర్శనశాలలో ఓ గుడ్లగూబ మృతిచెందగా.. పరీక్షల్లో బర్డ్‌ఫ్లూ అని తేలినట్టు జూ డైరెక్టరు రమేశ్ పాండే శనివారం తెలిపారు. సందర్శకుల వాహనాలను లోనికి అనుమతించకుండా అన్ని జాగ్రత్తలు తీసుకొంటున్నట్టు చెప్పారు.
Mon Jan 19, 2015 06:51 pm