హైదరాబాద్ : నిన్న దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైన విషయం తెలిసిందే. కరోనా టీకా వేయించుకున్న 51 మంది కరోనా వారియర్లు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. వీరంతా ఢిల్లీకి చెందిన వారే. వ్యాక్సినేషన్ డ్రైవ్‌లో భాగంగా శనివారం దేశవ్యాప్తంగా 1.91 లక్షల మందికిపైగా ఆరోగ్య రంగానికి చెందిన వారికి కరోనా టీకా వేశారు. అయితే ఢిల్లీలోని ఎన్డీఎంసీకి చెందిన చారక్ పాలికా ఆసుపత్రిలో కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న ఇద్దరు ఆరోగ్య కార్యకర్తలు అనంతరం తేలికపాటి ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొన్నారు. ఛాతిలో తేలికపాటి బిగుతుకు గురయ్యారు. దీంతో వారిద్దరిని కొంత సేపు వైద్యుల బృందం పరిశీలనలో ఉంచారు. 30 నిమిషాల తర్వాత కుదుటపడటంతో డిశ్చార్జ్ చేసినట్లు ఎన్డీఎంసీ అధికారి తెలిపారు. ఉత్తర రైల్వే సెంట్రల్ హాస్పిటల్‌లో మరో ఇద్దరికి కూడా ప్రతికూల లక్షణాలు కనిపించాయి. దక్షిణ ఢిల్లీ, నైరుతి జిల్లాల్లో 11 కేసులు నమోదయ్యాయి. అలాగే పశ్చిమ ఢిల్లీ, తూర్పు ఢిల్లీలో ఆరు ప్రతికూల సంఘటనలు నమోదయ్యాయి. ఆగ్నేయ ఢిల్లీలో ఐదు, నార్త్ వెస్ట్ ఢిల్లీలో నాలుగు, సెంట్రల్ ఢిల్లీలో రెండు, నార్త్ ఢిల్లీలో ఒకటి ప్రతికూల సంఘటనలు వెలుగుచూశాయి. వీటిలో దక్షిణ ఢిల్లీ పరిధిలో ఒక కేసును తీవ్రంగా పరిగణించారు. ఉత్తర రైల్వే సెంట్రల్ హాస్పిటల్‌లో ఇమ్యునైజేషన్ డ్రైవ్ చేసిన తరువాత ఆరోగ్య సంరక్షణ కార్మికుల్లో ఒకరిని మెరుగైన చికిత్సకు సూచించినట్లు అధికారులు తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm