హైదరాబాద్ : తనను ఎవరూ పట్టించుకోలేదని ఆవేదన చెందారు వైసీపీ ఎమ్యెల్యే రోజా. చిత్తూరు జిల్లా తిరుపతిలో జరిగిన అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ సమావేశంలో రోజా కన్నీళ్లు పెట్టుకున్నారు. అధికారులు తనకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని ప్రివిలేజ్ కమిటీ ఛైర్మన్ కాకాణి గోవర్ధన్ రెడ్డి ఎదుట రోజా ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో తనను పట్టించుకోవడం లేదని కనీసం అధికారిక కార్యక్రమాలకు తనను ఆహ్వానించడం లేదని ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమాలకు కూడా ప్రొటోకాల్ పాటించడం లేదని రోజా ఆరోపించినట్లు సమాచారం. ఎమ్మెల్యే ఆర్కే రోజా ఆరోపణలపై అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ ఛైర్మన్ కాకాణి గోవర్ధన్ రెడ్డి స్పందించారు. రోజా ఓ రోడ్డు విషయంలో పనులు కావడం లేదని మాత్రమే ఫిర్యాదు చేశారని పేర్కొన్నారు. ఆ అంశం తన పరిధిలో లేకపోయినా వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరించాలని కలెక్టర్ కు సూచించినట్లు వెల్లడించారు. ప్రొటోకాల్ విషయంలో ఏ శాసన సభ్యుడికి అన్యాయం జరిగినా తాము చర్యలు తీసుకుంటామన్నారు. శాసనసభా హక్కులు కాపాడటంలో అధికార పక్షం, ప్రతిపక్షం అనే తేడాలేదని కాకాణి స్పష్టం చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm