హైదరాబాద్: ఓ టీవీ నటిని నమ్మించి మోసం చేశాడు ఓ పైలట్. పెళ్లిచేసుకుంటానని చెప్పి ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డాడు. బాధిత టీవీ నటి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన మహారాష్ట్రలోని ముంబైలో చోటుచేసుకుంది. టీవీ నటి ఫిర్యాదు ప్రకారం.. "నాకు గతేడాది డిసెంబర్‌లో ఓ మ్యాట్రిమోనియల్ సైట్ ద్వారా నిందితుడితో పరిచయం ఏర్పడింది. అతడు మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు చెందినవాడు. అయితే ప్రస్తుతం ముంబైలో నివాసం ఉంటున్నాడు. అతడు నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. అయితే నన్ను కలిసేందుకు నేను ఉంటున్న చోటుకు వచ్చి లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైన చెబితే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని హెచ్చరించాడు"అని తెలిపింది. ఈ మేరకు బాధితురాలు గతవారం ముంబై సబర్బన్‌లోని ఓషివారా పోలీస్ స్టేషన్‌లో అతనిపై ఫిర్యాదు చేసింది. టీవీ నటి ఫిర్యాదు మేరకు సోమవారం ఎఫ్‌ఐఆర్ నమోదైందని పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాలు.."టీవీ నటి, పైలట్ ఒకరికొకరు పరిచమయ్యాక ఇద్దరు రెగ్యులర్‌గా ఫోన్‌లో మాట్లాడుకునేవారు. అలాగే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో కూడా చాట్ చేస్తుండేవారు. అయితే 10 రోజుల క్రితం అతడు బాధితురాలికి ఫోన్ చేసి.. ఆమెను కలవాలని ఉందని చెప్పాడు. అలాగే ఆమె ఇంటిని చూడాలనే కోరికను వ్యక్తం చేశాడు. ముంబైలో ఒంటరిగా నివసిస్తున్న ఆ టీవీ నటి ఇందుకు అంగీకరించింది. అతడిని ఇంటికి పిలిచింది. దీంతో బాధితురాలి ఇంటికి వచ్చిన పైలట్ అక్కడ ఆమెపై అత్యాచారం చేశాడు. అనంతరం పెళ్లిగురించి మాట్లాడేందుకు ఆమె తల్లిదండ్రులను పరిచయం చేయాల్సిందిగా నిందితుడు టీవీ నటిని కోరాడు. అయితే అతడు తన మాటను నిలుపుకోలేదు. అతని ప్రవర్తనతో విసుగు చెందిన టీవీ నటి పోలీసులను ఆశ్రయించింది"అని చెప్పారు. ఇక, బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm