హైదరాబాద్ : కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ ఆగ్రహం వ్యక్తం చేసారు. ప్రపంచ దేశాలు నైతిక వైఫల్యం చెందినట్లు టెడ్రోస్ ఆరోపించారు. జెనీవాలో జరిగిన ఎగ్జిక్యూటివ్ బోర్డు మీటింగ్‌లో ఆయన మాట్లాడుతూ.. పేద దేశాల్లోని ప్రజలకు టీకా అందకుండానే.. సంపన్న దేశాల్లోని ధనవంతులు టీకాలు వేసుకోవడం సరైన విధానం కాదన్నారు. ఇప్పటి వరకు 49 ధనిక దేశాల్లో సుమారు 4 కోట్ల మందికి టీకాలు ఇచ్చారని, కానీ ఓ పేద దేశంలో కేవలం 25 డోసుల వ్యాక్సిన్ మాత్రమే ఇచ్చినట్లు టెడ్రోస్ ఆరోపించారు. ప్రపంచ దేశాలు నైతిక పతనం దిశగా వెళ్తున్నాయని, దీని మూల్యం వల్ల పేద దేశాల్లో అధిక స్థాయిలో మరణాలు సంభవిస్తాయని టెడ్రోస్ వార్నింగ్ ఇచ్చారు. నాకే ముందు అన్న విధానం వల్ల స్వీయ ఓటమి తప్పదని, దీని వల్ల టీకా ధరలు పెరుగుతాయని, టీకాలను నిల్వ చేసే ప్రక్రియ జరుగుతుందన్నారు. ఇలాంటి చర్యల వల్ల మహమ్మారి మరింత కాలం తన ప్రతాపం కొనసాగిస్తుందని ఆయన అన్నారు. ప్రపంచ దేశాలు వ్యాక్సిన్ షేరింగ్ స్కీమ్‌లో భాగస్వామ్యం కావాలని, కోవాక్స్ విధానం కోసం సంపూర్ణంగా కట్టుబడి ఉండాలన్నారు. ఏప్రిల్ 7వ తేదీన వరల్డ్ హెల్త్ డే జరుపుకోనున్నామని, ఆనాటికి అన్ని దేశాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ జరగాలని, మహమ్మారిని అంతం చేసేందుకు అసమానతలను తొలగించాలని టెడ్రోస్ అన్నారు. డబ్ల్యూహెచ్‌వోకు చెందిన కోవాక్స్‌లో 180 దేశాలు సంతకం చేశాయని, డ్రగ్ కంపెనీలను ఏకం చేయడం కోసం ఈ గ్రూపును ఏర్పాటు చేశారు. పేద దేశాలకు టీకాలను అందించడమే ఆ గ్రూపు ప్రధాన లక్ష్యం.
Mon Jan 19, 2015 06:51 pm