హైదరాబాద్ : రామగుండం-3 ఏరియా పరిధిలో నిర్మాణంలో ఉన్న 50 మెగావాట్ల సింగరేణి సోలార్ పవర్ ప్లాంటు నుండి మరో 15 మెగావాట్ల సోలార్ విభాగాన్ని ఈరోజు టి.ఎస్. ట్రాన్స్ కోకు అనుసంధానం చేసినట్లు సంస్థ సి&ఎం.డి. శ్రీ ఎన్.శ్రీధర్ తెలియజేశారు. ఇప్పటికే ఈ 50 మెగావాట్ల సామర్థ్యం గల ప్లాంటు నుండి గత నవంబర్ 27వ తేదీన 15 మెగావాట్లు గ్రిడ్ కు అనుసంధానం చేశామనీ, దీంతో రామగుండం-3 సోలార్ ప్లాంటు నుండి మొత్తం 30 మెగావాట్ల సోలారు విద్యుత్తు ట్రాన్స్ కోకు అనుసంధానం అయిందని తెలిపారు. దీంతో మొదటి దశలోని 129 మెగావాట్ల సామర్థ్యంలో ఇప్పటికే 85 మెగావాట్ల సింగరేణి సోలార్ పవర్.. ట్రాన్స్ కోకు అనుసంధానమైందన్నారు. ఈ ప్లాంటులో ఇంకా మిగిలిన 20 మెగావాట్ల విభాగాన్ని వచ్చే నెల చివరికల్లా అనుసంధానం చేస్తామని వివరించారు. 15 మెగావాట్ల సోలార్ విద్యుత్ అనుసంధానంపై ఆయన సంబంధిత అధికారులకు, ఉద్యోగులకు తన అభినందనలు తెలియజేశారు.
సింగరేణి సంస్థ.. సింగరేణి వ్యాప్తంగా మూడు దశల్లో నిర్మిస్తున్న సోలార్ ప్లాంటుల్లో ఇప్పటికే మొదటి దశలోని నిర్మాణాలు దాదాపు పూర్తి కావచ్చాయి. మణుగూరు నుండి 30 మెగావాట్లు, రామగుండం-3 నుండి 30 మెగావాట్లు, ఇల్లందు నుండి 15 మెగావాట్లు, సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రంలోని సోలార్ ప్లాంటు నుండి 10 మెగావాట్లు ఇప్పటికే ట్రాన్స్ కోకు అనుసంధానం అయినాయి. తొలి దశలో ఇంకా మిగిలి ఉన్న 44 మెగావాట్లను వచ్చే నెల చివరికల్లా అనుసంధానం చేయాలని, రెండవ దశలోని 90 మెగావాట్ల ప్లాంటు నిర్మాణం మే, 2021 చివరి కల్లా పూర్తి చేయాలని సి& ఎం.డి. శ్రీ ఎన్.శ్రీధర్ సోలార్ విభాగం అధికారులను ఆదేశించారు. 3వ దశలో నిర్మించే 81 మెగావాట్ల ప్లాంటుల నిర్మాణం కూడా ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని తద్వారా మొత్తం 300 మెగావాట్ల సోలార్ విద్యుత్తును అందుబాటులోకి తేవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు ఆర్.జి.-3 ఏరియా జి.ఎం. శ్రీ కె.సూర్యనారాయణ, జి.ఎం. సోలార్ శ్రీ డి.వి.ఎస్.ఎస్.ఎన్.రాజు, బి.హెచ్.ఇ.ఎల్. ఎ.జి.ఎం. శ్రీ సుభాష్ భన్వాలికర్ తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 20 Jan,2021 05:36PM