హైదరాబాద్: రాష్ట్రంలో వెంటనే పీఆర్‌సీని అమలు చేసి, వారి న్యాయమైన డిమాండ్లను అమలు చేయాలని సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. రాష్ట్రంలో గత 30 నెలలుగా సుమారు తొమ్మిది లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, పబ్లిక్ సెక్టార్ మరియు కాంట్రాక్టు ఉద్యోగులు పీఆర్‌సీ కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సరైన రీతిలో స్పందించకుండా త్రిసభ్య కమిటీ వేసి కాలయాపనకు ప్రయత్నిస్తున్నది. ప్రభుత్వ జాప్యం వల్ల ఉద్యోగులు ఆందోళనలో ఉన్నారు. ఇది వారి జీవితాలతో చెలగాటమాడడమే. తెలంగాణలో గత రెండేళ్ళుగా పీఆర్‌సీ వాయిదా పడుతూ వస్తున్నది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం 2018 మే నెలలో సీఆర్ బిస్వాల్ చైర్మన్‌గా వేతన కమిటీ వేసింది. 2020 డిశంబర్ 31న ఆ కమిటీ నివేదిక కూడా ప్రభుత్వానికిచ్చింది. ఈ నివేదిక అధ్యయన నిమిత్తం వేసిన త్రిసభ్య కమిటీ 2021 జనవరి 2వ వారంలో నివేదిక ఇస్తుందని, 3వ వారంలో పీఆర్‌సీని తానే ప్రకటిస్తానని ముఖ్యమంత్రి ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో పేర్కొన్నా, నేటికీ కమిటీ నివేదికను బయటకు వెల్లడించకుండా గోప్యంగా ఉంచుతూ రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేస్తున్నది. ఇది ఉద్యోగుల్లో అసహనం పెరిగి ఆందోళనలకు, ఉద్యమాలకు దారితీస్తున్నది. ఇప్పటికైనా ప్రభుత్వం ఏమాత్రం ఆలస్యం చేయకుండా తక్షణమే పిఆర్సీ నివేదికను ఉద్యోగులకు అందుబాటులో ఉంచి, ఆయా సంఘాలతో చర్చించి ఆమోదయోగ్యమైన ఫిట్మెంట్‌తో 2018 జూలై 1 నుండి పీఆర్‌సీని అమలు చేయాలి. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం అమలు చేయడంతో పాటు, సిపిఎస్‌ను రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్దరించాలని సీపీఐ(ఎం) డిమాండ్ చేస్తున్నది.
Mon Jan 19, 2015 06:51 pm