Barbaric act in Nilgiris, Tamilnadu. An elephant was attacked with a burning tyre, in a private resort, killing the animal. Hope the guilty are punished for this inhumane act of violence. #WA #EveryLifeMatters #SaveWildlife pic.twitter.com/iLJn2yxgdq
— Praveen Angusamy, IFS 🐾 (@PraveenIFShere) January 22, 2021
హైదరాబాద్: ఏనుగు పట్ల క్రూరంగా వ్యవహరించిన కొందరు వ్యక్తులు దాని ప్రాణాలను బలిగొన్నారు. కాలుతున్న టైర్‌ను ఏనుగుపైకి విసిరివేయడంతో అది తీవ్రంగా గాయపడి మృతిచెందింది. ఈ అమానవీయ ఘటన తమిళనాడులోని నీలగిరి జిల్లాలోని మసినగుడిలో చోటుచేసుకుంది. మసినగుడిలోని ఓ ప్రైవేటు రిసార్ట్ సిబ్బంది ఈ దారుణానికి పాల్పడ్డారు. తీవ్ర గాయాలతో మరణించిన ఏనుగును గుర్తించిన అటవీశాఖ అధికారులు.. నిందితులను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. వారు రిసార్ట్‌లోని ఇద్దరిని అరెస్ట్ చేశారు. అందులో రిసార్ట్ ఓనర్ రేమాండ్, అక్కడ పనిచేస్తున్న ప్రశాంత్ ఉన్నారు. ఇక, విచారణ సాగిస్తున్న క్రమంలో వారి ఫోన్‌లలో.. కాలుతున్న టైర్‌ను ఏనుగుపైకి విసిరిన వీడియోను అధికారులు గుర్తించారు. ఇందుకు సంబంధిచిన వీడియోను అధికారులు శుక్రవారం విడుదల చేశారు. ఆ వీడియోలో కాలిన గాయాలతో ఏనుగు తల్లడిన తీరు స్పష్టంగా కనిపించింది. మంటలు అంటుకోవడంతో ఏనుగు అక్కడి నుంచి పరుగులు తీసింది. ప్రస్తుతం ఈ షాకింగ్ వీడియో పలువురిని కలచివేస్తోంది. ఇక, ఈ ఘటనపై అటవీ శాఖ అధికారులు మాట్లాడుతూ.. "మంటను ప్రయోగించడం ద్వారా ఏనుగును భయపెట్టాలని రిసార్ట్ సిబ్బంది భావించారు. అయితే వారు టైర్ విసరడంతో అది ఏనుగు చెవులకు అతుక్కుపోయి చాలాసేపు అక్కడే ఉండిపోయింది. దీంతో ఏనుగు తీవ్రంగా గాయపడింది. ఆ తర్వాత అక్కడికి సమీపంలోని డ్యామ్ వద్ద ఏనుగు తీవ్ర గాయాలతో పడిపోయి కనపించింది. అటవీ శాఖకు చెందిన వైద్యులు ఏనుగును కాపాడేందుకు ప్రయత్నించినప్పటికీ లాభం లేకుండా పోయింది. చాలా రక్తం కోల్పోవడం వల్లే ఏనుగు చనిపోయినట్టుగా ప్రాథమికంగా అంచనా వేస్తున్నాం. ఏనుగు చెవిపై కాలిన గాయాలు దాని మరణానికి కారణం కాదు"అని తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన ఐఎఫ్‌ఎస్ అధికారి ప్రవీణ్ అంగుసామి.. "నీలగిరిలో అనాగరిక చర్య. ఓ ప్రైవేట్ రిసార్ట్‌లో కాలుతున్న టైర్‌తో ఏనుగుపై దాడి చేసి దాని ప్రాణాలను బలితీసుకున్నారు. ఈ అమానవీయ చర్యకు పాల్పడిన దోషులను కఠినంగా శిక్షించాలి"అని పేర్కొన్నారు.