హైదరాబాద్: అయోధ్యలో రామాలయం నిర్మాణానికి విరాళాలు ఇవ్వొద్దంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే విద్యాసాగర్ రావుపై విమర్శలు జోరందుకున్నాయి. తాజాగా బిగ్ బాస్ ఫేమ్, నటి కరాటే కళ్యాణి కూడా టీఆర్ఎస్ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఫేస్ బుక్ లైవ్‌లో దీనిపై స్పందించిన కరాటే కళ్యాణి.. అయోధ్య రామ మందిర నిర్మాణానికి విరాళాలు ఇవ్వొద్దని చెప్పడానికి ఈ ఎమ్మెల్యే ఎవరని ప్రశ్నించింది. ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే తాట తీస్తా అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. అయినా విరాళాలు ఎమ్మెల్యే ఇంట్లో నుంచి ఇస్తున్నాడా ? అని ప్రశ్నించింది. శ్రీరామ భక్తి సేవ చేస్తామని.. కాదనడానికి ఇతనెవరని మండిపడ్డారు. ఎంతోమంది హిందువుల కోరిక ఈ రామాలయ నిర్మాణమని కరాటే కళ్యాణి వ్యాఖ్యానించింది. రామమందిర నిర్మాణం కోసం తాము జోలె పడతామని.. ఈ విషయంలో తాము సిగ్గుపడబోమని అన్నారు. స్థానికంగా ఉన్న రామాలయాలను అభివృద్ధి చేస్తామన్నందుకే.. ఇంత మెత్తగా ఆయనకు చెబుతున్నానని.. లేకపోతే మరోలా ఉండేదని కరాటే కళ్యాణి వ్యాఖ్యానించింది. రామ మందిరం కోసం తమ ఇష్టమొచ్చినట్టు చేస్తామని కరాటే కళ్యాణి తెలిపింది. వేరేవాళ్లు విరాళాలు ఇస్తుంటే ఎమ్మెల్యేకు ఎందుకంత ఇబ్బంది అని కామెంట్ చేసింది. తన వంతుగా తాను హరికథలు చెప్పి విరాళాలు సేకరిస్తానని.. తనలాగే చాలామంది ముందుకు వస్తారని అన్నారు. ఇక అయోధ్య రామ మందిరం నిర్మాణానికి ఇక్కడి ప్రజలెవరూ విరాళాలు ఇవ్వొద్దని కల్వకుంట్ల విద్యాసాగర్ రావు చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఉత్తరప్రదేశ్‌లో రామాలయం నిర్మిస్తే మనమెందుకు విరాళాలు ఇవ్వాలని అన్నారు. మన దగ్గర రాముడి ఆలయాలు లేవా అని వ్యాఖ్యానించారు.
Mon Jan 19, 2015 06:51 pm