హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు అవసరమైన ఉపకరణాలను ఉచితంగా అందజేస్తుందని షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి,దివ్యాంగుల సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ చెప్పారు. వీటి కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించామని మంత్రి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2020-21) దివ్యాంగులకు వివిధ రకాలైన 13,195 ఉపకరణాలు ఉచితంగా పంపిణీ చేయాలని కేసీఆర్ ఆదేశించారని కొప్పుల పేర్కొన్నారు. ఈ మేరకు 20కోట్ల 41లక్షల రూపాయల వ్యయంతో త్రిచక్రవాహనాలు, వీల్ఛైర్స్, లాప్టాప్స్, 4జీ స్మార్ట్ ఫోన్స్, వినికిడి యంత్రాలు, చేతికర్రలు, ఎంపీ3 ప్లేయర్స్ పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. 90వేల రూపాయల విలువ చేసే 900 రిట్రోఫెట్టెడ్ మోటారు వాహనాలు కూడా అవసరమైన వారికి అందజేస్తామని వివరించారు. ఉపకరణాల కోసం ఈనెల 25 నుంచి ఫిబ్రవరి 6 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవలసిందిగా మంత్రి వివరించారు. www.obmms.cgg.gov.in వెబ్ సైట్ ద్వారా దివ్యాంగులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అర్హతగల దివ్యాంగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవలసిందిగా మంత్రి కోరారు. జిల్లా కమిటీ ఎంపిక చేసిన దరఖాస్తుదారులకు ఫిబ్రవరి 15 నుంచి ఉపకరణాలను ఉచితంగా అందజేస్తామని మంత్రి తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm