కరీంనగర్: కరీంనగర్ నడిబొడ్డున టీఆర్‌ఎస్, బీజేపీ నాయకులు స్ట్రీట్‌ఫైట్‌కు దిగారు. తెలంగాణ చౌక్ వేదికగా కొట్టుకున్నారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌కుమార్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా టీఆర్‌ఎస్ కార్యకర్తలు సంజయ్ దిష్టిబొమ్మ దహనం చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ఆదివారం దిష్టిబొమ్మతో తెలంగాణ చౌక్‌కు చేరుకున్నారు. అప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై నిరసన తెలిపేందుకు బీజేపీ నేతలు అక్కడికి చేరుకున్నారు. బీజేపీ నాయకులు ఎదుటనే టీఆర్‌ఎస్ నాయకులు బండి సంజయ్ దిష్టిబొమ్మ దహనానికి యత్నించారు. దీంతో బీజేపీ శ్రేణులు అడ్డుకునేందుకు యత్నించాయి. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. మాటామాటా పెరగడంతో నాయకులు ఒకరినొకరు తోసుకున్నారు. కోపోద్రిక్తులైన కొంతమంది దాడికి దిగారు. అక్కడు ఉన్న పోలీసులు అప్రమత్తమై ఇరువర్గాలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోలీసులు ఓవైపు వారిస్తున్నా.. రెండు పార్టీల నేతలు వారిని తోసేసి దాడులు చేసుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు ఇరువర్గాలను చెదగొట్టే క్రమంలో టూటౌన్ సీఐ లక్ష్మీబాబు కిందపడ్డారు. పరస్పర దాడులకు దిగిన ఇరువర్గాలను చెదరగొట్టిన పోలీసులు రెండు పార్టీలకు చెందిన నాయకులను అదుపులోకి తీసుకున్నారు. టీఆర్‌ఎస్ కార్యకర్తలను వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌కు, బీజేపీ కార్యకర్తలను టూటౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దీంతో నగరంలో ఉద్రిక్త వాతావరణ నెలకొంది. రెండు పార్టీలకు చెందిన నేతలపై పోలీసులు ప్రత్యేక దృష్టిసారించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు. తెలంగాణచౌక్‌లో భారీగా పోలీసులను మోహరించారు. నగరంలోని పలు సమస్యాత్మక ప్రాంతాలపైనా పోలీసులు ప్రత్యేక దృష్టి సారించి బందోబస్తు నిర్వహించారు.
Mon Jan 19, 2015 06:51 pm