నవతెలంగాణ-హైదరాబాద్ బ్యూరో
కళలకు ఎల్లలు లేవని మన పెద్దలు చెబుతుంటారు. పసి పిల్లల బోసినవ్వులు ప్రపంచంలో ఎక్కడైనా ఒకే విధంగా ఉంటాయంటారు మానసిక శాస్త్రవేత్తలు. అయితే తమ కళాభిరుచికి, సృజనాత్మకతకు ప్రాంతీయ బేధాలు.. ధనిక, పేదా తారతమ్యాలు.. కులం, మతంలాంటి జాఢ్యాలు అడ్డురావని నిరూపించారు తెలుగు రాష్ట్రాల్లోని బాల బాలికలు. తాము నేర్చుకోవాలనుకున్న విద్య ఎక్కడ, ఏ రూపంలో దొరికినా దాన్ని అందిపుచ్చుకుని ప్రతిభను చాటుతామని వారు నిరూపించారు. తద్వారా కవులు, కళాకారుల, సాహితీ, సామాజికవేత్తలు.. 'భళా బాలలారా...' అనేట్టు చేశారు. కరోనా నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం, అక్కడి విద్యాశాఖ ఒక వినూత్నమైన ప్రయోగానికి శ్రీకారం చుట్టాయి. కోవిడ్ నేపథ్యంలో ఇటు పాఠశాలలు లేక, అటు లలిత కళలైన సంగీతం, నృత్యం, గానం, జానపదాలు, చిత్రలేఖనం లాంటి వాటిలో శిక్షణ పొందలేక ఇంటికే పరిమితమైన చిన్నారుల కోసం ఆన్‌లైన్ వేదికగా పలు కార్యక్రమాలను చేపట్టాలని నిర్ణయించాయి. ఈ క్రమంలో సెప్టెంబర్ ఒకటి నుండి హైదరాబాద్‌లోని జవహర్ బాలభవన్ డైరెక్టర్... రాష్ట్రంలోని జిల్లాల్లో ఉన్న బాల కేంద్రాల ద్వారా ఆన్‌లైన్ వేదికగా లలిత కళల్లో శిక్షణనిప్పించాలని ఆదేశించారు. అందులో భాగంగా సూర్యాపేట జిల్లా బాల కేంద్రం నుండి చిత్రలేఖనం, సంగీతర, గానం, నృత్యం, జానపదాలు, కరాటే, యోగతోపాటు కుట్లు, అల్లికలు, బొమ్మలు తయారు చేయటం తదితరాంశాల్లో ప్రతీరోజూ సాయంత్రం ఆన్‌లైన్ వేదికగా ఉచితంగా శిక్షణా తరగతులను ప్రారంభించారు. మొదట్లో సాధారణంగా ఉన్న ఈ ప్రయోగం.. క్రమక్రమంగా ఊపందుకుని విజయవతంగా కొనసాగతున్నది. ఆన్‌లైన్ సౌకర్యం వల్ల సూర్యాపేట, చుట్టుపక్కల ప్రాంతాల వారేగాక తెలంగాణ, ఆంధ్రా అనే తారతమ్యం లేకుండా కోస్తా, రాయలసీమ జిల్లాలకు చెందిన చిన్నారులు కూడా ఈ కళలను నేర్చుకుంటూ పలువురి ప్రశంసలు పొందుతున్నారు. ముఖ్యంగా గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, నరసరావుపేట, అన్నవరం, కడప, కర్నూలు ఇలా పలు ప్రాంతాల బాలలు ఆన్‌లైన్‌లో శిక్షణ పొందుతుండటం గమనార్హం. పొరుగు రాష్ట్రమైన కర్నాటక రాజధాని బెంగళూరులో నివాసముంటున్న తెలుగువారు సైతం తమ పిల్లలకు ఈ శిక్షణనిప్పిస్తూ సాంప్రదాయక కళలపట్ల తమకున్న అభిరుచిని చాటుకుంటున్నారు. కరోనా పూర్తిగా పోయి.. పాఠశాలలు పున్ణప్రారంభమైన తర్వాత కూడా సాయంత్రం వేళల్లో ఆన్‌లైన్ ద్వారా ఇలాంటి శిక్షణా కార్యక్రమాలను కొనసాగించాలంటూ ఎందరో తల్లిదండ్రులు కోరుతున్నారని అధికారులు చెబుతున్నారు. తెలంగాణ సర్కారు మాదిరిగానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా చిన్నారుల కోసం లలిత కళలను ఆన్‌లైన్ ద్వారా నేర్పించేందుకు కృషి చేయాలని ఆ ప్రాంతానికి చెందిన తల్లిదండ్రులు (జూమ్ లింకు ద్వారా నిర్వహించే సమావేశాల్లో) కోరుతున్నారని వారు తెలిపారు. లలిత కళల్లో ఆసక్తిగల బాల బాలికలు తమ పేరు, ఇతర వివరాలను 9494854468 అనే నెంబర్‌కు వాట్సాప్ చేయాలని సూర్యాపేట బాల కేంద్రం సూపరింటెండెంట్ బండి రాధాకృష్ణారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. శిక్షణ తీసుకోవాలనే అంశాన్ని విధిగా అందులో పేర్కొనాలని సూచించారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 25 Jan,2021 12:50PM