హైదరాబాద్: చిత్తూరు జిల్లాలో ఇద్దరు కూతుళ్లను మంత్రాల పేరుతో ఆదివారం రాత్రి తల్లి హత్య చేసిన ఘటన కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఈ జంట హత్యల ఘటనకు సంబంధించి పోలీసుల విచారణలో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. మృతుల్లో ఒకరైన సాయిదివ్య(22) మూడు రోజుల కిందట సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టినట్లు విచారణలో తేలింది. ‘శివ ఈజ్ కమ్.. వర్క్ ఈజ్ డన్’ అంటూ యువతి పోస్టులు పెట్టడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇతర ప్రాంతాల నుంచి వ్యక్తులు వచ్చి తరచూ ఘటన జరిగిన ఇంట్లో పూజలు చేసేవారని పోలీసులకు సమాచారం అందింది. దీంతో సీసీ టీవీ దృశ్యాలను పరిశీలిస్తున్నారు. ఇప్పటికే మృతుల తల్లిదండ్రులను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఇంట్లోనే ఉంచి విచారణ చేపడుతున్నారు. నివాసంలో దేవుళ్లతో పాటు చిత్రవిచిత్రంగా ఉన్న ఫొటోలను పోలీసులు గమనించారు. నిందితులకు వైద్య పరీక్షలు చేసిన అనంతరం వైద్యుల సలహాతోనే వారిని అరెస్టు చేస్తామని వారు చెబుతున్నారు. ఘటనకు గల ఆధారాలు సేకరించేందుకు ఇవాళ ఉదయం క్లూస్ టీం చిత్తూరు నుంచి మదనపల్లె బయల్దేరింది. మరోవైపు మృతదేహాలను మదనపల్లె ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
Mon Jan 19, 2015 06:51 pm