హైదరాబాద్ : గణతంత్ర దినోత్సవం సందర్భంగా నాంపల్లిలోని పబ్లిక్ గార్డెన్స్‌లో తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్.. జాతీయజెండాను ఎగురవేసి గౌరవవందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కొత్త పథకాలతో, కొత్త చొరవతో, కొత్త ఆవిష్కరణలతో కొత్త రాష్ట్రమైన తెలంగాణ సరికొత్త రికార్డులను నెలకొల్పుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ఓ శక్తి వంతమైన రాష్ట్రంగా రూపుదిద్దుకుంటుందన్నారు. ప్రభుత్వ పథకాలు, వాటి ఫలితాలను తన ప్రసంగంలో ప్రస్తావించిన గవర్నర్.. కోవిడ్ వల్ల ఆర్థిక ఇబ్బందులు వచ్చినా పథకాలు ఎక్కడ ఆగలేదని తెలిపారు. ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకాలు పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, రైతు వేదిక, హరితహారం, ధరణిలను ప్రస్తావించిన గవర్నర్.. అవినీతి రహిత, పారదర్శక పాలన అందించేందుకు పాలన పరమైన సంస్కరణలు ప్రభుత్వం తీసుకొచ్చిందని తెలిపారు. ఇక, హైదరాబాద్ నగరంలో నిర్మిస్తున్న పోలీస్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ త్వరలోనే ప్రారంభం కానుందన్నారు గవర్నర్ తమిళసై.. శాంతి భద్రతల పర్యవేక్షణ, వివిధ పోలీస్ స్టేషన్ల మధ్య సమన్వయం కోసం ప్రభుత్వం పోలీసు శాఖను పునర్వ్యవస్థీకరించిందన్నారు. సమతుల అభివృద్ధి, అన్ని వర్గాల సంక్షేమం లక్ష్యంగా ప్రభుత్వం కార్యాచరణ రూపొందించి, అమలు పరుస్తుందన్న ఆమె.. కొత్తగా ఏర్పాటైన రాష్ట్రమైనప్పటికీ అన్ని రంగాల్లో ఎంతో పురోగతి సాధించి, యావత్ దేశం దృష్టిని ఆకర్షించి.. ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు. బంగారు తెలంగాణ నిర్మాణానికి బలమైన పునాదులు పడ్డాయని వెల్లడించిన గవర్నర్.. ప్రజలందరి భాగస్వామ్యంతో ఈ ప్రగతి యజ్ఞాన్ని మరింత ముందుకు తీసుకుపోవడానికి ప్రభుత్వం గట్టి పట్టుదలతో పనిచేస్తుందని దృఢ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm