హైదరాబాద్ : కాంగ్రెస్ త్యాగాలతోనే దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని.. బాబాసాహెబ్ అంబేడ్కర్ అద్భుత రాజ్యాంగం రూపొందించారని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. రాజ్యాంగం.. పవిత్ర గ్రంథమని.. దేశం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా పరిపాలన చేస్తున్నాయని ఆరోపించారు. ప్రజలను విభజించి పాలించు విధానం అమలు చేస్తున్నారని మండిపడ్డారు. 60 రోజులుగా దీక్ష చేస్తున్న రైతుల పట్ల ప్రభుత్వానికి మానవత్వం లేదని... మోదీ ప్రభుత్వం పిడికెడు మంది కార్పొరేట్లకు వత్తాసు పలుకుతోందని ఆగ్రహించారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని గాంధీ భవన్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి జాతీయ జెండా ఆవిష్కరించారు. కేసీఆర్ రోజుకో మాట మాట్లాడుతున్నారని... ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఎత్తివేత లాంటి దుర్మార్గ చర్య ఎప్పుడూ చూడలేదన్నారు. రైతు వ్యతిరేక కేసీఆర్ పాలనపై నిరంతర పోరాటం చేస్తామని.. బీజేపీ, టీఆర్ఎస్ లోపాయకారి ఒప్పందంతో కాంగ్రెస్ను దెబ్బతీయాలని చూస్తున్నాయని ఆరోపించారు. కేసీఆర్ అవినీతిపై మాట్లాడే బీజేపీ.. విచారణకు ఎందుకు ఆదేశించడం లేదని ప్రశ్నించారు. ఎంఐఎం, టీఆర్ఎస్.. బీజేపీకి లబ్ది చేకూరేలా చేస్తున్నాయని.. ఎన్ని చేసినా 2023 ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm