హైదరాబాద్ : గణతంత్య్ర దినోత్సవం రోజున రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ ఢిల్లీలో భారీ ఎత్తున కిసాన్‌మజ్దూర్ ర్యాలీ జరిగింది. శాంతియుతంగా జరపాలని తలపెట్టిన ర్యాలీపై కేంద్ర బీజేపీ ప్రభుత్వం మరియు ఢిల్లీ పోలీసులు రైతులపై టియర్‌గ్యాస్‌తో తీవ్ర నిర్బంధాన్ని ప్రయోగించారు. లాఠీఛార్జీ చేసి రైతులను తీవ్రంగా గాయపర్చారు. ఈ ఘటనలో ఉత్తరాఖాండ్‌కు చెందిన నవనీత్‌సింగ్ అనే రైతు మరణించడం చాలా బాధాకరం. వీరి మృతికి సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కమిటీ సంతాపాన్ని, వారి కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేస్తున్నది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం భేషజాలకు పోకుండా రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను రద్దు చేసి, ఉద్యమం ఇంకా ఉధృతం కాకుండా చూడాలని డిమాండ్ చేస్తున్నది. ఈ రైతాంగ పోరాటానికి మద్దతుగా హైదరాబాదులో నిర్వహించదలచిన ప్రదర్శనకు రాష్ట్ర టీఆర్‌ఎస్ ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వకుండా నిరాకరించింది. హైకోర్టు జోక్యంతో సరూర్‌నగర్ స్టేడియం నుండి ఉప్పల్ స్టేడియం వరకు అనుమతి లభించింది. ఈ ర్యాలీకి ప్రజలు భారీ ఎత్తున హాజరవడంతో జయప్రదమైంది. ఇది విజయవంతం కావడానికి తోడ్పడిన రాజకీయ పార్టీలకు, రైతుసంఘాలకు, ప్రజాసంఘాలకు, స్వచ్చంద సంస్థలకు, రైతు ఉద్యమ శ్రేయోభిలాషులందరికీ సీపీఐ(ఎం) ధన్యవాదాలు తెలియజేస్తున్నది. రైతాంగ ఉద్యమానికి భవిష్యత్‌లో కూడా ఇదే రకమైన తోడ్పాటునందించాలని వారికి విజ్ఞప్తి చేస్తున్నది.
Mon Jan 19, 2015 06:51 pm