హైదరాబాద్ : తెలంగాణలో పీఆర్సీపై నేడు ప్రభుత్వం కీలక ప్రకటన చేయనున్నట్టు సమాచారం. వేతన సవరణతో పాటు ఇతర అంశాలపై నేటి నుంచి ఉద్యోగ సంఘాలతో అధికారుల కమిటీ చర్చలు జరపనుంది. ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సీఎస్ సోమేశ్ కుమార్ అధ్యక్షతన ముఖ్య కార్యదర్శులు రామకృష్ణారావు, రజత్ కుమార్‌లతో గల త్రిసభ్య కమిటీ చర్చలు నిర్వహించనుంది. బుధవారం సాయంత్రం 5 గంటలకు టీజీవో, టీఎన్జీవో సంఘాలతో చర్చలు జరపనుంది. ఈ క్రమంలో వేతన సవరణ సంఘం నివేదికను ప్రభుత్వం నేడు బహిర్గతం చేయనుంది. మధ్యాహ్నం ఉద్యోగ సంఘాలకు ప్రభుత్వం వివరాలు ఇవ్వనుంది. మూల వేతనంపై 7.5 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వాలని పీఆర్సీ నివేదికలో పేర్కొంది. ఉద్యోగుల కనీస వేతనం రూ. 19 వేలు ఉండాలని సిఫార్సు చేసింది. గరిష్ట వేతనం 1,62,070 వరకు ఉండొచ్చని సిఫారసు చేసింది. ఉద్యోగుల పదవీ విరమణ వయసు 60 ఏండ్లకు పెంచాలని, హెచ్ఆర్ఏ తగ్గిస్తూ సిఫార్సు చేసింది. గ్రాట్యుటీ పరిమితి రూ. 12 లక్షల నుంచి రూ. 16 లక్షలకు పెంపు, శిశు సంరక్షణ సెలవులు 90 నుంచి 120 రోజులకు పెంపు, సీపీఎస్‌లో ప్రభుత్వ వాటా 14 శాతానికి పెంచాలని పీఆర్సీ సిఫార్సు చేసింది. 2018 జులై 1వ తేదీ నుంచి వేతన సవరణ అమలు చేయాలని కమిషన్ సిఫార్సు చేసింది.
Mon Jan 19, 2015 06:51 pm