ఢిల్లీ: దేశ రాజధానిలో రైతుల ఆందోళన హింసాత్మకంగా మారిన నేపథ్యంలో ఢిల్లీలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. కిసాన్ పరేడ్‌లో భాగంగా చారిత్రక ఎర్రకోటను ముట్టడించిన రైతులు కోటపై సిక్కుల జెండా, రైతు సంఘాల జెండాలను ఎగరేసి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ పరిణామాలతో పరిస్థితులు ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారాయి. దీంతో ఢిల్లీ వ్యాప్తంగా బుధవారం పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎర్రకోట వద్ద భారీగా పోలీసులు మెహరించారు. ఢిల్లీ ప్రధాన ప్రాంతాల్లోనూ భద్రత పెంచారు. ఉద్రిక్తతల నేపథ్యంలో ఢిల్లీ-ఎన్‌సీఆర్ పరిధిలోని చాలా ప్రాంతాల్లో మొబైల్ ఇంటర్నెట్ సేవలపై ఆంక్షలు కొనసాగుతున్నాయి. రైతులు ఉద్యమం సాగిస్తున్న సింఘు, టిక్రి, ఘాజీపూర్, ముకర్బా చౌక్, నంగ్లోయి తదితర ప్రాంతాల్లో నిన్న మధ్యాహ్నం నుంచే ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. రైతులు ఉద్యమం చేస్తున్న సరిహద్దు ప్రాంతాల్లోనూ భారీగా పోలీసుల బలగాలు చేరుకున్నాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా భద్రతను కట్టుదిట్టం చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm