హైదరాబాద్ : ఏపీలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని చోట్లా పోటీ చేస్తామని జనసేన పార్టీ స్పష్టం చేసింది. జనసేన, బీజేపీ విజయవాడలో సమావేశం నిర్వహించి ఈ ఎన్నికలపై చర్చించాయి. ఇందులో జనసేన నేత నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ పలు విషయాలు తెలిపారు. ఏకగ్రీవాల విషయంలో వైసీపీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలతో కలిసి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను కలుస్తామని తెలిపారు. వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలు ఏకగ్రీవాలను ప్రోత్సహిస్తున్నట్లు ఉన్నాయని చెప్పారు. ఎన్నడూ లేని విధంగా ఏకగ్రీవాలపై పత్రికల్లో ప్రకటనలు వేయిస్తున్నారని తెలిపారు. ఎన్నికలు శాంతియుత వాతావరణంలో జరగాలని నాదెండ్ల మనోహర్ చెప్పారు. ఏకగ్రీవాల విషయంలో గతంలో జరిగిన ఘటనల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ సమావేశంలో బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎన్నికల నేపథ్యంలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకోకుండా చూడాల్సిన బాధ్యత సర్కారుపై ఉందన్నారు. స్థానిక ఎన్నికల్లో అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా వారిని బెదిరించే ధోరణిని అరికట్టాలని కోరారు.
Mon Jan 19, 2015 06:51 pm