హైదరాబాద్ : విహారయాత్ర విషాద యాత్రగా మారింది. ప్రమాద వశాత్తు బోటు నీట మునగడంతో నలుగురు మరణించారు. ఈ సంఘటన అసోం రాష్ట్రం జోర్హాట్ జిల్లాలో జరిగింది. విహారయాత్రకు వెళ్లిన కొందరు పర్యాటకులు నాటు పడవలో బ్రహ్మపుత్ర నదిలో విహరిస్తుండగా ఆ పడవ ఒక్కసారిగా మునిగిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో పడవలో మొత్తం 12 మంది ఉండగా ఇద్దరు మైనర్‌లు సహా నలుగురు నదిలో మునిగిపోయారు. మిగితా 8 మందిని స్థానికులు రక్షించి మరో నాటు పడవలో ఒడ్డుకు తీసుకొచ్చారు. ఒడ్డుకు చేరిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని జోర్హాట్ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న స్టేట్ డిజాస్టర్ రెస్సాన్స్ ఫోర్స్ (ఎస్‌డీఆర్ఎఫ్) సిబ్బంది రంగంలోకి దిగి మృతదేహాలను వెలికితీశారు. మృతులు పబన్ రాజ్ (30), రజియా తిగుల (24), సాహిల్ చౌహాన్ (15), సుఫియాన్ చౌహాన్ (9)గా గుర్తించారు.
Mon Jan 19, 2015 06:51 pm