హైదరాబాద్ : ఓ ఇంజినీరింగ్ విద్యార్థి సజీవ దహనమయ్యాడు. ఈ దారుణమైన సంఘటన భువనేశ్వర్ లోని రణస్థలం మండలంలో చోటు చేసుకుంది. రణస్థలం పంచాయతీ పరిధి సీతంపేట గ్రామ సమీప తోటల్లో విద్యార్థి సజీవదహనమై కనిపించిన ఘటన బుధవారం ఉదయం వెలుగు చూసింది. ఉదయం 5.30 గంటల సమయంలో పొలాలకు వెళ్లిన రైతులకు దుర్గారావు అనే వ్యక్తికి చెందిన పొలంలోని ధాన్యం బస్తాలు కాలిపోయి పొగలు రావడాన్ని గమనించారు. దీంతో వారంతా పక్కనే ఉన్న తోటపల్లి కాలువలోని నీటిని బకెట్లతో తీసుకొచ్చి కాలిపోతున్న ధాన్యం బస్తాలపై జల్లుతుండగా...పక్కనే కాలిపోయిన శవం కనిపించడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. దీంతో విషయాన్ని రణస్థలంలోని గ్రామ పెద్దల దృష్టికి తీసుకెళ్లగా.. వారు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. అనంతరం జిల్లా కేంద్రంలోని క్లూస్‌టీంకు తెలియజేయడంతో వారు వచ్చి కాలిపోయిన మృతదేహాన్ని, సమీపంలో పడిఉన్న ఏటీఎం కార్డు, పర్సులోని కళాశాల ఫీజు రశీదును గుర్తించారు. వాటి ఆధారంగా సజీవ దహనమైన యువకుడు మువ్వల నగేష్(18)గా తెలుసుకున్నారు. ఇతను ఎచ్చెర్ల మండలం చిలకపాలెం సమీపంలోని శివాని కళాశాలలో ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్నాడని, స్వగ్రామం జిల్లాలోని వజ్రపుకొత్తూరు మండలం నువ్వులరేవుగా తేలిందని పోలీసులు తెలిపారు. విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేయగా మృతుడు సోదరుడు మేఘనాథ్ (ఆర్‌ఎంపీ వైద్యుడు) సంఘటనా స్థలానికి చేరుకున్నాడు. సజీవదహనమైన తమ్ముడు నగేష్‌ని చూసి కన్నీటి పర్యంతమయ్యాడు. పోలీసులు అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm