సిద్దిపేట: సిద్ధిపేటలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 6గురు తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని కొండపాక మండలం తిమ్మారెడ్డిపల్లి శివారులో రాజీవ్ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. హైదరాబాద్ సోమాజిగూడ ప్రాంతంలోని ఒకే కుటుంబానికి చెందిన పలువురు ట్రాలీ ఆటోలో వేములవాడలో దైవ దర్శనం కోసం వెళ్లారు. తిరుగు ప్రయాణంలో హైదరాబాద్‌కు చేరుకునే క్రమంలో తిమ్మారెడ్డిపల్లి శివారులో ఆటోను వెనుక నుంచి ఆర్టీసీ బస్సు ఢీకొట్టి వెళ్లింది. దీంతో ఆటో రోడ్డుపై బోల్తాపడింది. ఆటోలో ప్రయాణిస్తున్న కళావతి (35), వెంకటమ్మ (70), రాజు (38), ఎడ్ల ప్రశాంత్ (20), పవన్‌కుమార్ (18), ప్రదీప (18) లకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు అందించిన సమాచారంతో 108 అంబులెన్స్ సిబ్బంది క్షతగాత్రులను పోలీసుల సహాయంతో ప్రథమ చికిత్స చేశారు. అనంతరం గజ్వేల్ ప్రభుత్వ దవాఖానలో చేర్పించారు. గాయపడిన వారిలో వెంకటమ్మ, వపన్‌కుమార్, ప్రశాంత్‌ల పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm