హైదరాబాద్: రాష్ట్రంలో ప్రాథమికోన్నత పాఠశాలల విద్యార్థులకూ ప్రత్యక్ష తరగతుల ప్రారంభంపై సర్కారు కీలక నిర్ణయం తీసుకున్నది.. సీఎం కేసీఆర్ మంగళవారం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. 6, 7, 8 తరగతులకు బుధవారం నుంచే తరగతులు ప్రారంభించుకోవచ్చని తెలిపారు. ఇందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. సీఎం నిర్ణయం నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ మంగళవారం జిల్లా కలెక్టర్లు, విద్యాశాఖాధికారులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ శాఖల జిల్లా అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. 6 నుంచి 8వ తరగతి వరకు విద్యార్థులకు ప్రత్యక్ష తరగతులను బుధవారం నుంచి మార్చి 1లోపు ప్రారంభించాలని ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా 6, 7, 8 తరగతుల్లో 17.24 లక్షల మంది విద్యార్థులున్నారు. వీరితోపాటు ఇప్పటికే హాజరవుతున్న 9, 10 తరగతి విద్యార్థులు కూడా ఉంటారని సీఎస్ తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలోని విద్యా పర్యవేక్షక కమిటీలు సమావేశమై 6 నుంచి 8వ తరగతి వరకు క్లాసులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఉపాధ్యాయుల, విద్యార్థుల భద్రతకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టంచేశారు. తల్లిదండ్రుల లిఖితపూర్వక అనుమతి ఉంటేనే విద్యార్థులను అనుమతించాలన్నారు. 9, 10 తరగతుల విద్యార్థులకు ఫిబ్రవరి 1 నుంచి ప్రత్యక్ష తరగతులు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
ఈ సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ, ఎస్సీ సంక్షేమ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి బి.వెంకటేశం, మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శి నదీమ్ అహ్మద్, గిరిజన సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. కాగా తల్లిదండ్రుల అనుమతి ఉంటేనే విద్యార్థులను తరగతులకు అనుమతించాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులకు స్పష్టం చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 24 Feb,2021 06:44AM