హైదరాబాద్ : భారత్, ఇంగ్లాండ్ మధ్య పింక్ బాల్ టెస్టులో ఇంగ్లీష్ స్పిన్నర్ల ధాటికి భారత బ్యాట్స్‌మెన్ క్రీజులో నిలిచేందుకు తంటాలు పడ్డారు. ఇంగ్లాండ్ స్టార్ స్పిన్నర్ జాక్ లీచ్, కెప్టెన్ జో రూట్ స్పిన్ దెబ్బకు టీమ్‌ఇండియా టపటపా వికెట్లు కోల్పోయింది. ఈ జోడీ పోటీపడి వికెట్లు తీసింది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 53.2 ఓవర్లలో 145 పరుగులకే ఆలౌటైంది. టీమ్‌ఇండియాకు 33 పరుగుల ఆధిక్యం లభించింది. ఒకనొక దశలో 98/3తో పటిష్ఠస్థితిలో ఉన్న భారత్ ప్రత్యర్థి స్పిన్ ద్వయం అద్భుత బౌలింగ్ ముందు ఆతిథ్య బ్యాట్స్‌మెన్ నిలవలేకపోయారు. గురువారం ఆటలో మొదటి సెషన్‌లో భారత్ చివరి 7 వికెట్లను కోల్పోయి ఇన్నింగ్స్‌ను ముగించింది. అశ్విన్(17), ఇషాంత్ శర్మ(10) మినహా అందరూ సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. భారత ఇన్నింగ్స్‌లో ఓపెనర్ రోహిత్ శర్మ(66: 96 బంతుల్లో 11ఫోర్లు) ఒక్కడే అర్ధశతకంతో మెరిశాడు. శుభ్‌మన్ గిల్(11), పుజారా(0), విరాట్ కోహ్లీ(27), రహానె(7), పంత్(1), వాషింగ్టన్ సుందర్(0), అక్షర్ పటేల్(0) నిరాశపరిచారు. ఆఖర్లో అశ్విన్ కొద్దిసేపు ధాటిగా ఆడే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. అంతకుముందు ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 112 పరుగులకే కుప్పకూలింది.
Mon Jan 19, 2015 06:51 pm