హైదరాబాద్ : పాత కక్షలు నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎర్దండిలో ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. బుధవారం రాత్రి.. గ్రామానికి చెందిన రాజేశ్వర్ను అదే ఊరికి చెందిన పోశెట్టి గొడ్డలితో నరికాడు. తీవ్ర గాయాలపాలైన రాజేశ్వర్ అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానిక మద్యం దుకాణం వద్ద ఈ ఘటన జరిగింది. మృతునితో అతనికి పాత కక్షలు ఉన్నట్లు స్థానికులు తెలిపారు. ఐదేళ్ల క్రితం రాజేశ్వర్కు పోశెట్టితో గొడవ జరగగా అది కేసుల వరకూ వెళ్లింది. తాజాగా రాత్రి బెల్టుషాపులో ఉన్న రాజేశ్వర్పై పోశెట్టి గొడ్డలితో దాడి చేశాడు. గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం మెట్పల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. రాజేశ్వర్ మృతితో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.
Mon Jan 19, 2015 06:51 pm