హైదరాబాద్ : ఓ తల్లి తన బిడ్డకు పాలు ఇస్తుండగా పాము కాటు వేయడంతో ఆ తల్లి మృతి చెందింది. ఈ విషాద ఘటన కృష్ణా జిల్లాలోని గంపలగూడెంలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని చంద్రాపూర్ మండలం సోనాపూర్ నుంచి కొందరు కూలీలు కృష్ణా జిల్లా గంపలగూడెం మండలంలోని ఊటుకూరు వచ్చారు. మిరప కోతలకు వెళుతూ గ్రామంలోని బీసీ కాలనీ పాఠశాల దగ్గర గుడారంలో ఉంటున్నారు. అయితే మంగళవారం రాత్రి వారంతా పడుకున్నారు. అర్ధరాత్రి వేళ పక్కనే పడుకున్న పాపకు ఆకలి కావడంతో లేచి ఏడుస్తోంది. దీంతో పాప తల్లి శ్రుతి ప్రమోద్ భోయర్ (21)కు వెంటనే మెలకువ వచ్చింది. బిడ్డను పొదివి పట్టుకుని తన స్తనం నోటికి అందించారు. అదే సమయంలో ఓ పాము.. శ్రుతి రొమ్ముపై కాటేసింది. వెంటనే తేరుకున్న శ్రుతి పామును చేతిలో పక్కన విసిరేసింది. ఆ క్రమంలో పాము ఆ పక్కనే నిద్రపోతున్న రూపేష్ ప్రకాష్ చప్డే అనే యువకుడిపై పడి, అతడినీ కాటేసింది. వారిని వెంటనే విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా శ్రుతి చనిపోయింది. యువకుడి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా విషాదఛాయలు అలుముకున్నాయి.
Mon Jan 19, 2015 06:51 pm