హైదరాబాద్ : కోవిడ్ అనంతరం తిరుమలకు భక్తుల సంఖ్య క్రమేణా పెరుగుతున్నందువల్ల పిఎసి 1, పిఎసి 2, రెండవ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో అల్పాహారం, అన్నప్రసాదాల పంపిణీకి చర్యలు తీసుకోవాలని టీటీడీ ఈవో డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. టీటీడీ పరిపాలన భవనంలోని తన చాంబర్ లో గురువారం ఆయన అన్న ప్రసాదం విభాగంపై సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ.. భక్తుల సంఖ్య పెరుగుతున్నందువల్ల వారికి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. మాతృశ్రీ తరిగొండ అన్న ప్రసాద కేంద్రం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని వంటశాలల్లో ఆధునిక వంట సామగ్రి ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఈవో అధికారులను ఆదేశించారు. అన్న ప్రసాదం విభాగం ఏర్పాటు అయినప్పటి నుంచి ఇప్పటిదాకా దశల వారీగా అన్న ప్రసాదం అందిస్తున్న భక్తుల సంఖ్య, సేవలు ఎలా పెరుగుతూ వచ్చాయనే విషయంపై అధికారులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. కోవిడ్ సమయంలో బాధితులకు, లాక్డౌన్ సమయంలో పేదలు, కూలీల కు లక్షలాదిమందికి అన్న ప్రసాదం పంపిణీ చేసిన వివరాలను తెలియజేశారు. ఈ సమీక్షలో అదనపు ఈవో శ్రీ ధర్మారెడ్డి, సివిఎస్వో శ్రీ గోపీనాథ్ జెట్టి, అన్నదానం డిప్యూటి ఈవో శ్రీ నాగరాజు, కేటరింగ్ ఆఫీసర్ శ్రీ జిఎల్ ఎన్ శాస్త్రి పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm