హైదరాబాద్ : కరోనా టీకా ధరను 150 రూపాయలుగా కేంద్రం నిర్ణయించింది. సర్వీస్ ఛార్జీతో కలిపి టీకా డోసు ధర 250 రూపాయలకు మించొద్దని ఆదేశించింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వేసే టీకా ఉచితం కాగా.. ప్రైవేటు ఆస్పత్రుల్లో టీకా ధరను ప్రజలే చెల్లించాలని కేంద్రం స్పష్టం చేసింది. ఇక గుజరాత్ డిప్యూటీ సీఎం నితిన్ పటేల్.. రాష్ట్ర ప్రజలు ప్రైవేటు ఆస్పత్రుల్లో టీకా తీసుకోవాలనుకుంటే 250 రూపాయలు చెల్లించాలని చెప్పారు. వంద రూపాయలు రిజిస్ట్రేషన్‌కు.. డోసుకు 150 రూపాయలు చెల్లించాలని సూచించారు. మరోవైపు మార్చి 1 నుంచి రెండో విడత కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రారంభమవుతుందని కేంద్రం తెలిపింది. రెండో విడతలో 60 ఏళ్లు పైబడిన వారికి టీకాలు అందించనున్నట్లు వెల్లడించింది. వ్యాక్సినేషన్ తదుపరి ప్రక్రియ దేశవ్యాప్తంగా 10,000 ప్రభుత్వ దవాఖానలతో పాటు 20,000కుపైగా ప్రైవేట్ దవాఖానల్లో సాగనుంది. ప్రభుత్వ కేంద్రాల్లో ఉచితంగా వ్యాక్సిన్ లభ్యమవనుండగా, ప్రైవేట్ దవాఖానల్లో వ్యాక్సిన్ తీసుకోవాలని కోరుకునే వారు డబ్బు చెల్లించాల్సి ఉంటుందని దీని ధరను ప్రభుత్వం ఒకటి రెండు రోజుల్లో ఖరారు చేస్తుందని కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ వెల్లడించారు.
Mon Jan 19, 2015 06:51 pm