హైదరాబాద్ : పీఎస్ఎల్వీ-సీ 51 ప్రయోగానికి రంగం సిద్ధమైంది. ఇందుకోసం నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని షార్‌లో శనివారం 8 గంటల 54 నిమిషాలకు కౌంట్‌డౌన్ ప్రారంభించారు. 25 గంటల 30 నిమిషాల పాటు కౌంట్‌డౌన్ కొనసాగుతుంది. ఆదివారం ఉదయం 10 గంటల 24 నిమిషాలకు పీఎస్ఎల్వీ-సీ 51 నింగిలోకి దూసుకెళ్లనుంది. దీని ద్వారా బ్రెజిల్‌కు చెందిన అమెజానియా-1తో పాటు మరో 18 ప్రైవేటు ఉపగ్రహాలను ఇస్రో నింగిలోకి పంపుతోంది. 50 ఏళ్ల ఇస్రో చరిత్రలో మొట్టమొదటిసారిగా దేశీయ ప్రైవేటు సంస్థల ఉపగ్రహాలను నింగిలోకి పంపుతోంది. ఇస్రో మాజీ ఛైర్మన్ సతీశ్ ధవన్ పేరుపై స్పేస్ కిడ్జ్ ఇండియా రూపొందించిన సతీశ్ ధవన్ శాట్‌ను పీఎస్‌ఎల్‌వీ-51 నిర్దేశిత కక్ష్యలో ప్రవేశపెట్టనుంది. తొలిసారిగా ఆర్బిట్‌లోకి ఉపగ్రహాన్ని పంపనుండటంతో ఓ ప్రత్యేకత ఉండాలని భావించిన స్పేస్ కిడ్జ్ ఇండియా ప్రధాని నరేంద్రమోదీ చిత్రపటాన్ని ఉపగ్రహంలో పంపుతున్నారు. మోదీ పేరు, ఫొటో, దాని కింద ఆత్మ నిర్భర్ మిషన్ అనే పదాలతో పాటు భగవద్గీత కాపీ, 25 వేల మంది పేర్లను కూడా పంపుతున్నారు. ఈ 25 వేల పేర్లలో వెయ్యి మంది విదేశీయులవికాగా, మిగిలినవి చెన్నైలోని ఓ పాఠశాలకు చెందిన విద్యార్థుల పేర్లు ఉన్నాయి. గతంలో కొన్ని దేశాలు రాకెట్ ప్రయోగాల్లో బైబిల్‌ను అంతరిక్షంలోకి పంపాయి.
Mon Jan 19, 2015 06:51 pm