హైదరాబాద్ : కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై పరువునష్టం కేసు వేస్తానని పుదుచ్చేరి మాజీ సీఎం వి.నారాయణస్వామి చెప్పారు. కరైకల్ లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో తనపై అమిత్ షా తప్పుడు ఆరోపణలు చేశారని, తన ప్రతిష్ట దెబ్బతినేలా వ్యాఖ్యానించారని ఆయన మండిపడ్డారు. తనపై అమిత్ షా చేసిన వ్యాఖ్యలను నిరూపించాలని డిమాండ్ చేశారు. పుదుచ్చేరికి ప్రధాని మోడీ రూ. 15,000 కోట్లు పంపారని... ఆ మొత్తంలో నారాయణస్వామి కోత పెట్టి, గాంధీ కుటుంబానికి చేరవేశారని అమిత్ షా ఆరోపించారు. ఈ ఆరోపణలపై మాజీ సీఎం మండిపడ్డారు. అమిత్ చేసిన వ్యాఖ్యలను తాను సవాల్ చేస్తున్నానని నారాయణస్వామి చెప్పారు. తనపై చేసిన ఆరోపణలను ఆయన తక్షణమే నిరూపించాలని అన్నారు. ఆరోపణలను నిరూపించలేకపోతే పుదుచ్చేరి ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. గాంధీ కుటుంబ ప్రతిష్టను, తన ప్రతిష్టను నాశనం చేసేలా వ్యాఖ్యానించిన అమిత్ షాపై పరువునష్టం దావా వేస్తానని చెప్పారు.
Mon Jan 19, 2015 06:51 pm